పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో ఎంపీ ఒకవైపు.. వైకాపా ఎమ్యెల్యేలందరూ మరోవైపులా పరిస్థితి తయారైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్టరాజును నియంత్రించించేందుకు వైకాపా ఎమ్యెల్యేలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వారం కిందట వైకాపా ఎంపీలు పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జిల్లాలో ఎమ్యెల్యేలు ఎంపీపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలోని వివిధ పోలీస్టేషన్లలో ఎమ్యెల్యేలు.. ఎంపీ రఘురామకృష్టరాజుపై వరుస ఫిర్యాదులు చేశారు.
మొదట మంత్రి...
తన పరువుకు భంగం కలిగించాడని ఎంపీపై రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం పోడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను, తన కొడుకును చించపరిచేలా రఘురామకృష్టరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఫిర్యాదులో కోరారు. మంత్రి బాటలోనే జిల్లాలో మరో ఇద్దరు ఎమ్యెల్యేలు ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహచర వైకాపా ఎమ్యెల్యేలను కించపరిచే విధంగా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారని.. చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నరసాపురం శాసన సభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజు సైతం ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మినహా, ఎమ్యెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరు ప్రసాద్ రాజు ఇద్దరూ ఎంపీతో సన్నిహితంగా మెలిగేవారే కావడం గమనార్హం. పార్టీ ఆదేశాలతో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీపై ఎమ్మెల్యే వెంకటనాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి తణుకు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.