'ఉండి నియోజకవర్గంలోని ఓ నాయకుడు మూలంగా పార్టీ ప్రతిష్ఠ రోజు రోజుకూ దిగజారుతోంది. పార్టీ కోసం పదేళ్లు కష్టపడిన వైకాపా కార్యకర్తలను కాదని తెదేపా నుంచి వచ్చిన నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు. పక్క పార్టీ వారికి పదవులు, వైకాపా కార్యకర్తలపై పోలీసు కేసులు' అంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఉండి నియోజకవర్గ వైకాపా కన్వీనర్ తీరుపై అసహనంతో ఆ పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినట్లు తెలిస్తోంది.
ఓ వైకాపా నాయకుడు వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గంలోని పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భీమవరం-తాడేపల్లిగూడెం రోడ్డులోనూ ఫ్లెక్సీలు పెట్టారు. నియోజవర్గ కన్వీనర్ వైకాపా కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, తెదేపా నుంచి వచ్చిన నాయకులకే పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తెదేపా నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు అని వాపోతున్నారు. నియోజకవర్గంలో ఈ ప్లెక్సీల ఏర్పాటుపై చర్చ నడుస్తుంది. అధిష్ఠానం తమకు న్యాయం చేయాలని వైకాపా కార్యకర్తలు కోరుతున్నారు.