పదిహేను రోజుల్లో.. ఎకరాకు పాతిక బస్తాలకు పైగా వడ్లు ఇంటికొస్తాయనే ఆనందంలో ఉన్న రైతులపై తీవ్ర వాయుగుండం విరుచుకుపడింది. గింజ దశలో ఉన్న వరిని వరదై ముంచెత్తింది. వారం, పది రోజులపాటు నీటిలోనే నాన్చింది. లాక్‌డౌన్ నుంచి అమ్మకాల్లేక విలవిల్లాడుతున్న పండ్లతోటల రైతులపైనా వాన పిడుగులా పడింది. అరటి, బొప్పాయి పండ్ల తోటలు, మిరప, కూరగాయలు వంటి ఉద్యాన పంటలూ తుడిచిపెట్టుకుపోయాయి. ఖరీఫ్ మొదలయ్యాక కొన్నిచోట్ల పైర్లు 3సార్లు మునగ్గా.. మరికొన్నిచోట్ల 2సార్లు ముంపుబారిన పడ్డాయి. రైతులు ఎకరానికి రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టినా.. వడ్లగింజ కాదు కదా పశువుల మేతకు ఎండుగడ్డి కూడా మిగలేదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద బాధిత రైతులు 'ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్' బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా వరి నాలుగు, అయిదు అడుగులు పెరుగుతుంది. వరదలు ముంచెత్తడంతో వరి చేలల్లో వారం, నుంచి 15 రోజుల వరకు తొమ్మిది అడుగుల ఎత్తున నీరు నిలవడంతో కుళ్లిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఏలేరు, ప్రత్తిపాడు, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లో నష్టం అధికంగా ఉంది. ఇప్పటికీ పలుచోట్ల వరి పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కట్టలు తెంచుకుంటూ వరదనీరు బయటకు పారుతోంది. ఎర్రకాలువ జలాశయం నుంచి భారీ ఎత్తున వరదనీరు ముంచెత్తడంతో.. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో మాగాణుల్లో తొమ్మిది అడుగుల ఎత్తున నీరు నిలిచింది. 75 వేల ఎకరాల వరకు నీటి ముంపులోనే ఉంది. పది రోజులకు పైగా నీరు బయటకు పోక చాలాచోట్ల వరి కుళ్లిపోయింది. నిడదవోలు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, పాలకోడేరు, ఆకివీడు, భీమవరం, ఆకివీడు, కాళ్ల, అత్తిలి, పెనుమంట్ర, ఆచంట, యలమంచిలి, మొగల్తూరు, నర్సాపురం తదితర మండలాల్లోని వరి చేలల్లో నిలిచిన నీరు నాచుపట్టి పచ్చగా కన్పిస్తోంది. కొన్ని మండలాల్లో రొయ్యల చెరువుల కట్టలు తెగి.. వాగులు, చెరువులు ఏకమయ్యాయి.
నేలకూలుతున్న అరటి, బొప్పాయి తోటలు