Supreme Court Advised On Polavaram Construction Issues: మనమంతా ఒకదేశంలో ఉన్నామని, అంతర్రాష్ట్ర వివాదాలపై ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకు సూచించింది. మధ్యవర్తిత్వం నడిచేటప్పుడు పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టంచేసింది. పోలవరం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టు పనులను ఆపేయాలన్న ఒడిశా వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి వాదనలు వినిపించారు. సమస్య పరిష్కారానికి ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించామని, రాష్ట్రాలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలిపాయన్నారు. తమకు సమయమిస్తే 2 నెలల్లోగా ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి, కోర్టుకు తుది నివేదిక సమర్పిస్తామన్నారు.
ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఒడిశా తరఫు సీనియర్ న్యాయవాది అరుణ్‌కట్పాలియా.. సెప్టెంబరులో తొలి సమావేశం జరిగిందని వెల్లడించారు. అక్టోబరులో సాంకేతిక అంశాలపై మరో సమావేశం నిర్వహించారన్నారు. అందరి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చెప్పాలన్నారు. అక్టోబరు 19న మా అభ్యంతరాలను సమర్పించామన్న ఆయన..తర్వాత ఏ స్పందనా రాలేదని.. మరోవైపు ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని పేర్కొన్నారు. వరద వచ్చినప్పుడు వెనుకజలాలు మమ్మల్ని ముంచెత్తుతున్నాయని, పనులను నిలిపేయాలని ధర్మాసనానికి వివరించారు. అత్యవసరమైన అంతర్రాష్ట్ర వివాదంలో అక్టోబరు నుంచి ఎలాంటి పురోగతి లేదని వాదించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ప్రశ్నించారు. డిసెంబరు 2న సీడబ్ల్యూసీ నివేదిక వచ్చిందని, రాష్ట్రాల నుంచి భిన్నాభిప్రాయాలున్నాయని ఏఎస్‌జీ తెలిపారు. వీటిపై మేం నివేదిక సమర్పించాక కోర్టు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని చెప్పారు. తమ అభిప్రాయాలను నవంబరు 4న సమర్పించామని, ఒడిశా విధానానికి తామూ కట్టుబడి ఉన్నామని ఛత్తీస్‌గఢ్ న్యాయవాది తెలిపారు.