Temples in Godavari Districts ready for Maha Shivratri Celebrations: ఉభయ గోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. స్వామివార్లను వేల సంఖ్యలో దర్శించుకునే భక్తుల కోసం అధికారులు, పాలకవర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పరిసర ప్రాంతాల్లోనూ, తూర్పు గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లోనూ ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తణుకులోని సిద్దేశ్వర స్వామి, సోమేశ్వర, కపర్దీశ్వర స్వామి వారి ఆలయాలు, ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి.. పాలంగిలోని రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. తారకాసురుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు సిద్ధులు, యోగులు తమ ఇష్టదైవం అయిన సిద్దేశ్వర స్వామిని ప్రతిష్టించినట్లు, తారకాసురుడు కపర్దీశ్వర స్వామిని పూజించినట్లు, రావణాసురుడు సోదరుడు విభీషణుడు సోమేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు పురాణ చరిత్ర వల్ల తెలుస్తోంది.
గోకర్ణేశ్వర స్వామి చరిత్ర: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రోజుల్లో ఉరగరాజనే సామంత రాజు ఉండ్రాజవరంలో గోకర్ణేశ్వర స్వామిని పూజించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.