పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంపునకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలపడంతో వచ్చే 2021 - 22 ఆర్థిక సంవత్సర ప్రారంభం నుంచి అమల్లోకి తేవాలనే యోచనతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు ప్రాంతాల వారీగా అద్దె ప్రతిపాదికన ఆస్తిపన్ను విధిస్తుండగా ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్దేశించిన ఆస్తి విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే స్థల విలువతో పాటు భవన నిర్మాణ విలువను కలిపి పరిగణనలోకి తీసుకుంటారు.
దీనివల్ల ప్రస్తుతం చెల్లించే పన్ను పెరుగుతుందని అంచనా. పెంచిన మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదికి 15 శాతం వంతున నిర్దేశించిన మొత్తం వరకు పెంచుకుంటూ వెళ్తారు. దీంతోపాటు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏటా పెరిగే ఆస్తి విలువ కనుగుణంగా పన్ను పెరుగుతుంది. కొత్త విధానంలో నివాసగృహాలపై విలువ ఆధారంగా 0.10 శాతం నుంచి 0.50 వరకు ఆస్తిపన్ను పెంచుతారు. వాణిజ్య సముదాయాలపై 0.25 శాతం నుంచి 2.00 వరకు పెంచుతారు. ఇప్పటివరకు ఐదేళ్లకోసారి పన్ను పెంపుదల చేస్తుండగా, కొత్త విధానంలో ప్రతి ఏటా పన్ను పెంపుదల ఉంటుంది. కొత్తగా ఆస్తి పన్ను విధింపులోనూ మార్పు తీసుకువచ్చారు.
కొత్తగా గృహ, వాణిజ్య భవనాలకు పన్ను విధించాలంటే నూతన విధానాన్నే అనుసరిస్తారు. పెరుగుదల ప్రభావం విలువను బట్టి రూ.500 నుంచి రూ.3 వేలు వరకు ఉంటుంది. వాణిజ్య భవనాలకు రూ.లక్షల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లోని 9 పురపాలక సంఘాల పరిధిలో 1,73, 652 నిర్మాణాలపై ఇప్పటివరకు రూ.86 కోట్ల మేర ఆదాయం వస్తుండగా పన్ను పెంపుదలతో మరో పన్నెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.