నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని నిర్లక్ష్యంగా వదిలేశాడు. కంటికి రెప్పలా కాపాడిన తండ్రిని కాదనుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సింది పోయి.. ఉన్న ఆస్తిని లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా.. నిర్దాక్షిణ్యంగా ఇంటినుంచి గెంటేశారు. చెట్టంత కొడుకులు చేదోడుగా ఉంటారని వారు‘కన్న’కలలు కల్లలయ్యాయి. ఉండడానికి గూడు లేక.. ఎక్కడ వెళ్లాలో తెలియక... ఆ వృద్ధ దంపతులను వీధిపాలు చేశాయి.
ఆస్తిని లాక్కున్నారు... తల్లిదండ్రులను గెంటేశారు - collector
రెక్కల కష్టంతో సంపాదించుకున్న 3 ఎకరాల పొలాన్ని కన్నకొడుకు లాక్కుని ఇంటి నుంచి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు. తలదాచుకునేందుకు గూడు లేక పైవంతెన కింద ఆ దిక్కులేని వృద్ధులు బతుకీడుస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోడూరుకు చెందిన తోట కొర్రయ్య... కొడుకు కారణంగా భార్యతో కలిసి రోడ్డుపాలయ్యాడు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నాడు. కొర్రయ్యకు ఆరుగురు సంతానం. భార్యాభర్తలిద్దరూ కలిసి కాయకష్టం చేసే వాళ్లందరికీ పెళ్లిళ్లు చేశారు. 30 సంవత్సరాల క్రితం మూడు ఎకరాల పొలం కొనుగోలు చేశారు. అప్పటి నుంచి కొర్రయ్య మగ పిల్లలు ఇద్దరు పొలం మీద వచ్చే ఆస్తిని అనుభవిస్తున్నారు.
వృద్ధాప్యం వచ్చిన తరువాత తమ ఆస్తిని లాక్కొని తనను, తన భార్యను చిత్రహింసలకు గురి చేసి... ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బస్టాండ్ వంతెన కింద జీవిస్తున్నామన్నారు. ఈ విషయం పై పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన న్యాయం జరగలేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ ఆస్తిని తామే అనుభవించే విధంగా న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.