ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ కు కాస్త సడలింపు ఉంది. ఆ వేళల్లో నిత్యావసర సరుకుల క్రయవిక్రయాలకు అనుమతి ఉంది. అది కూడా.. భౌతిక దూరం పాటిస్తూ మాత్రమే చేయాలని అధికారులు, పోలీసులు పదే పదే చెబుతున్నారు. కానీ.. అమలాపురంలో మాత్రం ఈ విషయాలు జనానికి పట్టడం లేదు. భౌతిక దూరం మాటే మరిచిపోయినట్టుగా.. అసలు లాక్ డౌనే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
వాహనచోదకులు అధిక సంఖ్యలో రహదారుల మీదకు వస్తున్నారు. చేపల మార్కెట్ వద్ద పరిస్థితి ఇలాగే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆంక్షల సడలింపు సమయంలో అమలాపురం వైపు వస్తున్న కారణంగా.. జన సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. పోలీసులు వారిని అదుపు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజలు సహకరిస్తే తప్ప.. ఈ సమస్య అదుపులోకి వచ్చేలా లేదు.