'పార్టీ అంశంపై ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానంలో రావడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఇదంతా వృథా ప్రయాసే. ప్రభుత్వ ఖర్చుతో ఎంపీలు దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయడమేంటి? కావాలంటే మెయిల్ ద్వారా పంపొచ్చు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుల్లో చూపుతారో, పార్టీ ఖర్చులో వేస్తారో చూడాలి. దేవుడి భూములను అమ్ముకుందామనుకుంటున్నారు. ఇది మంచిది కాదని సీఎంకు చెప్పా. ఆయన పెద్ద మనసుతో ఆపేశారు. ఇసుక గురించి మంత్రులు మాట్లాడిన తర్వాత ఒకట్రెండు విషయాలు చెప్పా. నేనేమీ పార్టీలోని పెద్దలు వాటిని అమ్ముకుని తినేస్తున్నారని, ఇళ్ల స్థలాల్లో గోల్‌మాల్ చేస్తున్నారని చెప్పలేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే పార్టీ ఎందుకు షోకాజ్ నోటీసిచ్చిందో, నేను చెప్పిన కుంభకోణాలకు పార్టీకి ఏం సంబంధమో అర్థం కావడం లేదు.'అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
సీఎం జగన్ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనిపిస్తోంది: రఘురామకృష్ణరాజు - లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న వైకాపా ఎంపీలు వార్తలు
వైకాపా నాయకత్వం తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా తాను అగ్నిపునీతుడినై వస్తానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాను తప్ప ఆయన గురించి, పార్టీ గురించి పల్లెత్తు మాట అనలేదని గుర్తు చేశారు. తనకిచ్చిన షోకాజ్ నోటీసులోని అంశాలపై ఇప్పటికే సీఎంకు లేఖ రాశానని, ఇప్పుడు స్పీకరు పిలిచి సంజాయిషీ కోరినా అదే చెబుతానన్నారు. వారి ఫిర్యాదులోనే పసలేదని, తాను డిస్‌క్వాలిఫై కావడం కాదు ఆ పిటిషనే డిస్‌క్వాలిఫై అవుతుందని వ్యాఖ్యానించారు.
బాలశౌరి ఉద్బోధతో ఇదంతా జరుగుతున్నట్లు నాకున్న సమాచారం. నాపై ఫిర్యాదుకు చేసిన ఖర్చును ప్రజలు భరించాలి. విమాన ఛార్జీలు రూ.13-14 లక్షల భారాన్ని ప్రజలే మోయాలి. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందనుకున్నా. విమానం ఏర్పాటు చేశారంటే అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందని నాకిప్పుడే స్పష్టమైంది. వీరి పిటిషన్ చెల్లదని స్పీకర్ చెప్పిన తర్వాతైనా సీఎం కరుణిస్తారేమో చూద్దాం. నా గురించి వెంకటరెడ్డి అనే వ్యక్తి అవాకులు చెవాకులు పేలితే దాని గురించి స్పీకరుకు ఫిర్యాదు చేశా. గడ్డిబొమ్మలు తగలేసినట్లు నన్నూ తగలేస్తామని బెదిరించడంతో నా ప్రాణాలకు రక్షణ కల్పించాలని అడిగానని చెబుతా. ఇందులో ఏ అంశమూ అనర్హత కిందికి రాదు. ప్రజల కష్టాలు చెబితేనే అనర్హత వేటు వేస్తే అస్సలు లోక్‌సభలో ఎవరూ ఉండరు.
-ఎంపీ రఘురామకృష్ణరాజు