లాక్‌డౌన్‌లో రైతులను ఆదుకునేందుకు కొన్ని మినహాయింపులు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ చాలా కీలకమన్నారు. 25 శాతమే కందులు, శనగల సేకరణకు అనుమతి ఉందని...50 శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరామని కన్నబాబు అన్నారు. మద్దతు ధర ప్రకటించినా కొనుగోళ్లు జరగటం లేదన్నారు. మొక్కజొన్న, జొన్నపై మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
అరటి, బత్తాయి, టమాటాకు మద్దతు ధర ప్రకటించామని మంత్రి కన్నబాబు అన్నారు. అనంతపురం, కడప జిల్లాల నుంచి కొని ఇతరచోట్లకు సరఫరా అవుతున్నట్లు తెలిపారు. దిల్లీ, కాన్పూర్ లాంటి మార్కెట్లు తెరిస్తేనే మంచి ధర వస్తుందన్నారు.
ధాన్యం కొనుగోలుకు గోనెసంచుల కొరత ఉందని... రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. కోళ్లు, గుడ్లు రవాణా చేసే వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కోళ్ల ధర పెరిగిందని.. దాణా సరఫరా అవుతోందన్నారు. పూలతోటల రైతుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు.