పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వళికి చెందిన డాక్టర్ గారపాటి సత్యనారాయణ వరప్రసాద్ రావు.. మొక్కలపై ఉన్న ప్రేమతో తన ఇంటినే ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. తన సతీమణి సుబ్బలక్ష్మితో కలసి 15ఏళ్లుగా తన ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచుతున్నాడు. రెండు వేల గజాలు ఉన్న తన ఇంటి ఆవరణంలో వివిధ రకాల పూల మొక్కలు, అలంకరణ మొక్కలు, తీగజాతి మొక్కలు, ఆయుర్వేద మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయలు ఇలా అనేక రకాల మొక్కల్ని పెంచారు. తన పాత ఇంటి పైకప్పునకు సైతం పచ్చని పందిళ్లు పాకించారు. ప్రహరీ చుట్టూ తీగజాతి మొక్కలు నాటారు. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, డ్రాగన్ ట్రీ, నార్ఫోల్క్ ఐస్ లాండ్ ఫైన్, యూరోపియన్ ఆలివ్, పార్లర్ పామ్, ఫిడిల్ లీవ్ ఫిగ్, రబ్బర్ చెట్లు, రఫీస్ పామ్, ఎడారి మొక్కలు, ఫెర్న్ మొక్కలు ఆ ఇంటి ప్రాంగణంలో కనిపిస్తాయి. నీటిని నిల్వచేసి.. నీటి మొక్కలు సైతం పెంచుతున్నారు. పూలమొక్కలు అధికంగా ఉండటం వల్ల.. సీతాకోకచిలుకలు కనువిందు చేస్తున్నాయి.
ఉద్యానవనం
ప్రసాద్ రావు ఇంటి ఆవరణంలో... ఏ మూల చూసిన మొక్కలే దర్శనమిస్తాయి. అరుదైన మొక్కల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తానంటున్నారు. తనకు నచ్చిన మొక్కలను విదేశాల నుంచి సైతం తెప్పించుకొంటానని అన్నారు. ఉద్యానవనంలాంటి ఆ ఇంటి ప్రాంగణంలో తోటపనిని కూడా ఆ దంపతులే చేస్తారు. తోటపని వల్ల.. వ్యాయామంతో పనిలేదంటున్నారు.