గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించారు. ముంపునకు గురైన పంటలను, ఇళ్లను పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై తెదేపా బృందం ఆరా తీసింది.
పోలవరంలో అవినీతి జరిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పిన మాటలను గమనించాలన్నారు లోకేశ్. వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పోలవరం వ్యయం పెరుగుతుందన్నారు. రాజధానిని నిర్మించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులోనూ కోత విధిస్తున్నారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లను మూసివేయటం కక్ష సాధింపు చర్యలేనన్నారు. వర్షాలు, వరదలతో పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన వారికి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోవటం లేదని ఆరోపించారు.