పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిరుపేదలకు అందించే ఇళ్ల స్థలాల విషయంలో అధికార పార్టీ నేతలే సీఎంకు లేఖ రాయడం సంచలనం రేపింది.
తణుకు పట్టణ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కాపవరం, పైడిపర్రుతో పాటు అజ్జరం పుంతలో సుమారు 57 ఎకరాలు భూమి సేకరించారు. ఈ భూమికి ఎకరానికి కోటి అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. కాపవరంలో 40 నుంచి 60 లక్షల రూపాయలకు, పైడిపర్రులో 75 లక్షల రూపాయలకు భూములు దొరికే అవకాశం ఉండగా.... కోటి 5 లక్షల రూపాయలు చొప్పున అజ్జరం పుంతలో కొనుగోలు చేయడం వల్ల 14 కోట్ల రూపాయల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు వైకాపా నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బలగం సేతుబంధన సీతారామం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. అధికారులను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యం... దీనివల్ల తన నియోజకవర్గంలో నెరవేరడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 75 వేల రూపాయల వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు వసూలు చేశారని ఆరోపించారు.
భూముల కొనుగోలులో నిధుల దుర్వినియోగం, అవినీతి చోటుచేసుకుందని దీనిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు.
బెదిరింపులకు లొంగి పనిచేయలేదు: ఆర్డీవో
వైకాపా నాయకుడు బలగం సేతుబంధన సీతారామం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖపై రెవెన్యూ అధికారులు స్పందించారు. కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి వివరణ ఇస్తూ... అధికారులకు స్థలం శాశ్వతం కాదు కానీ ఉద్యోగం శాశ్వతమని అందువల్ల ఎవరి బెదిరింపులకు లొంగి తాము పని చేయమని చెప్పారు. కాపవరం, పైడిపర్రులలో భూములు ఇచ్చిన రైతులు కాకుండా మిగిలిన రైతులెవ్వరూ తమ భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అజ్జరం పుంతలో కొనుగోలు చేశామన్నారు.