పోలవరం నిర్వాసితులకు 6 నెలల్లో పరిహారం చెల్లించాలి: ఎన్జీటీ
13:41 September 18
ఏపీలో పోలవరం ముంపు బాధితులకు 6 నెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం గురించి దాఖలైన పిటిషన్లపై ఎన్‌జీటీలో విచారణ జరిగింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, పెంటపాటి పుల్లారావు ఈపిటిషన్లు దాఖలు చేశారు. ముంపు ప్రభావంపై ఏర్పాటైన సంయుక్త కమిటీ నివేదికను ఎన్జీటీ ఆమోదించింది. ఈ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను ఎన్జీటీ వ్యతిరేకించింది.
అంతర్రాష్ట్ర జలవివాదాల జోలికి వెళ్లకుండా పర్యావరణంపై ప్రభావంపై విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. బాధితులకు పరిహారం అంశాలపై విచారిస్తామని స్పష్టం చేసిన ఎన్జీటీ.. రెండు నెలల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో భేటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సంయుక్తంగా భేటీ నిర్వహించాలని ఆదేశించింది. గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్ ఏపీ జలవనరులశాఖ భేటీ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఎగువ రాష్ట్రాల సందేహాలను తీర్చాలన్న కమిటీ సిఫార్సును ఎన్జీటీ ఆమోదించింది. ఏపీలో పోలవరం ముంపు బాధితులకు 6 నెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. పోలవరం పూర్తయితే కలిగే ముంపుపై తెలుగు రాష్ట్రాలు చర్చించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. భద్రాచలం వద్ద గోదావరికి ఇరువైపులా ముంపుపై చర్చించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ... కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ