విద్యుత్తు వినియోగాన్ని బట్టి పంపిణీ సంస్థ స్లాబులుగా విభజించి ఛార్జీలు వసూలు చేస్తోంది. నెలలో వంద యూనిట్ల వరకు వాడితే బిల్లు రూ.202.50 వస్తుంది. ఒక్క యూనిట్ అదనంగా వాడినా స్లాబు మారి రూ.334.30 అవుతుంది. ఇంధన సుంకం, సేవా రుసుము అదనం. యూనిట్లు వంద దాటకుండా చూసుకుంటే నెలకు రూ.131.80, ఏడాదికి రూ.1581.6 ఆదా చేసుకోవచ్చు. 200 యూనిట్ల వరకు విద్యుత్తు బిల్లు రూ.760 వస్తుంది. ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా బిల్లు రూ.1007.20 అవుతుంది. అంటే నెల బిల్లు 247.20 పెరుగుతుందన్న మాట.
ఏ ఉపకరణంపై ఎలాంటి జాగ్రత్త అవసరం
రిఫ్రిజిరేటర్: పాత ఫ్రిజ్‌లకు కరెంట్ ఎక్కువ కాలుతుంది. డీప్‌ఫ్రిజ్‌లో మంచు గడ్డ కడుతోందంటే కాలం చెల్లినట్లే. పాతదాంతో 166 యూనిట్లు కాలితే కొత్త ఫ్రిజ్‌తో వంద యూనిట్ల లోపే వస్తుంది. బిల్లులో నెలకు రూ.300కు పైగా ఆదా అవుతుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూడాలి.
ఏసీ: సాధారణ రోజుల్లోనూ ఏసీల వినియోగం పెరుగుతోంది. 18-19 డిగ్రీల మధ్య కాకుండా, 24-26 డిగ్రీలు ఉండేలా చూసుకుంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఏసీతోపాటు ఫ్యాన్ వేసుకోవడం మేలు. అలానే ఏసీ గదిలో అనవసర వస్తువులు ఉంటే తీసేయాలి.
వాషింగ్ మెషిన్: ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతికేయడం చాలామందికి అలవాటు. పూర్తిగా లోడు అయ్యాకే వాషింగ్ మెషిన్ ఉపయోగించాలి. రోజువారీ దుస్తులకు వేడి నీరు అవసరంలేదు.
మెక్రోఓవెన్: వండే పదార్థాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మధ్యలో తరచూ తెరిచి చూడటం వల్ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు పడిపోతుంది. మళ్లీ వేడెక్కేందుకు అధిక విద్యుత్తు ఖర్చవుతుంది.
గీజర్: గీజర్ ఉన్న ఇళ్లలో 200 యూనిట్లు దాటడంతో బిల్లు రూ.వెయ్యిపైనే వస్తుంటుంది. బిల్లు తగ్గాలంటే ఇంట్లోవారు వెనువెంటనే స్నానాలు చేయాలి. థెర్మోస్టాట్ 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్ నీటిని వాడేలా పైపులు ఉండాలి.