High Court on Kovvali Pond: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామ పరిధిలోని 304 ఎకరాల చెరువును ఆక్రమణ నుంచి రక్షించే దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. 304 ఎకరాల మొత్తాన్ని సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆక్రమణలు తొలగించి చెరువును పూర్తి స్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది. నీటి వనరులను ఆక్రమణల నుంచి రక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలు సందర్భాల్లో గుర్తు చేసిందని, ఈ మేరకు తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఏపీ హైకోర్టు సైతం చెరువులు, కుంటలు, కాలువలను రక్షించేందుకు తీర్పు ఇచ్చిందని తెలిపింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
కొవ్వలి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 131/4లో విస్తరించి ఉన్న 304 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ భూమి ఆక్రమణలకు గురైందని, భూమి స్వభావాన్ని మార్చేసి వ్యవసాయం సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ‘గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్’ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సౌందర్య మనోహరి, మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. సంబంధిత చెరువు నుంచి అందే నీటి ద్వారా 3వేల 500 ఎకరాల వరకు సాగు చేసుకుంటారన్నారు. తాగు నీటికి వినియోగిస్తారన్నారు. దెందులూరు తహశీల్దార్ 304 ఎకరాలలో 177 ఎకరాలను ‘క్రిష్టియన్ భూములు’గా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులో మార్పులు చేశారన్నారు. ఆ 177 ఎకరాల్లో ప్రస్తుతం సాగు చేసుకుంటున్నారన్నారు. చెరువుకు చెందిన 304 ఎకరాల్లో ఎలాంటి సాగు చేయకుండా నిలువరించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.