ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి పరవళ్లు తొక్కుతున్నా... పరిస్థితి ఇంతేనా

నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ముందువరుసలో నిలిచిన... పశ్చిమగోదావరి జిల్లాలో గడ్డు పరిస్థితి ఏర్పడింది. కనీసం తాగడానికి నీరులేని దుస్థితిలో ఈ జిల్లా ప్రజలున్నారు. భానుడి ప్రతాపం రోజురోజుకు పెరగడంతో నీటివనరులు క్రమంగా అడుగంటిపోతున్నాయి. డెల్టాలో తాగునీటి చెరువులు నెర్రలుచాచి దర్శనమిస్తున్నాయి. మెట్టప్రాంతంలో భూగర్భజలాలు ప్రమాదకరస్థాయికి పడిపోయాయి. ఫలితంగా రక్షిత మంచినీరు కరవైంది.

By

Published : May 18, 2019, 9:02 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో తాగునీటి ఎద్దడి

పశ్చిమగోదావరి జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చుట్టూ నీరున్నా... తాగలేని దుస్థితి నెలకొంది. జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం డెల్టాలో చెరువులు నింపి నీరు నిల్వ ఉంచారు. ప్రస్తుతం ఆ చెరువుల్లో నీరు పాచిపట్టి.. కలుషితమైంది. ఈ నీటినే పొదుపుగా సరఫరా చేస్తున్నారు. 443 గ్రామాల్లో చెరువులు పూర్తిగా నింపితే... డెల్టా ప్రాంతంలో తాగడానికి మంచినీరు అందుబాటులో ఉంటుంది. ఈసారి ముందుగా గోదావరి కాలువలకు నీటి సరఫరా నిలిపివేశారు. ఫలితంగా చెరువులకు పూర్తిస్థాయిలో నీరు చేరలేదు.

జిల్లాలోని 48 మండలాల్లో ఒక్కోచోట.. ఒక్కోరకమైన సమస్య ఉంది. డెల్టా ప్రాంతంలో గోదావరి నీటిపైనే ప్రజలు ఆధారపడతారు. ఆక్వా సాగువల్ల తాగునీటి చెరువులు కలుషితమయ్యాయి. ఈ నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా... ఈ నీరుతాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం పురపాలక సంఘాల్లో దాదాపు 20లక్షల మంది నివసిస్తున్నారు. కానీ వారి డిమాండ్​కు అనుగుణంగా నీరు సరఫరా జరగడం లేదు.

గోదావరి నది పరవళ్లుతొక్కే జిల్లాల్లో నానాటికి భూగర్భజలం అడుగంటుతోంది. దీంతో ఇబ్బందులు తప్పడంలేదు. మెట్ట ప్రాంతంలో రెండువేలకు పైగా రక్షిత మంచినీటి బోర్లు ఉన్నాయి. వాటి నుంచి అంతంత మాత్రమే నీరు వస్తోంది. మార్చి నాటికి జిల్లా సరాసరి భూగర్భజల మట్టం 19మీటర్ల మైనస్​గా నమోదవగా... గతేడాది మే నెలలో 15మీటర్లు మైనస్‌లో ఉంది. ఫలితంగా మెట్ట ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు చెబుతున్నారు, ముందుచూపుతో ఆలోచిస్తే నీటి సమస్య వచ్చేది కాదని అంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో తాగునీటి ఎద్దడి

ABOUT THE AUTHOR

...view details