ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరు వానలతో పొంగిన వాగులు..ఇబ్బందుల్లో ప్రజలు - పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండంతో పశ్చిమగోదావరిజిల్లాలో వాగులు, వంకలు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల నుంచి వేల క్యూసెక్కుల వరద విడుదలవుతోంది. తమ్మిలేరు జలాశయం నుంచి రికార్డు స్థాయిలో వరదనీరు విడుదల చేస్తుండటంతో ఏలూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకొంది. నగరంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోంది. వరదతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వంతెన కింది నుంచి ప్రవహిస్తున్న వరద
వంతెన కింది నుంచి ప్రవహిస్తున్న వరద

By

Published : Oct 15, 2020, 8:07 AM IST

వరద ఉధృతి

పశ్చిమగోదావరిజిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరావళి మండలాల్లో 20సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 13మండలాల్లో 15సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటున 13సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో తమ్మిలేరు, ఎర్రకాలువ, జల్లేరు, కొవ్వాడ జలాశయాల నుంచి భారీగా వరదనీటిని విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు, ఎర్రకాలువ జలశయాల నుంచి 20వేల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు దిగువున ఉన్న ఏలూరు నగరాన్ని వరదనీరు ముంచెత్తుతోంది.

ప్రమాద హెచ్చరిక..

తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాల వద్ద సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. తమ్మిలేరు జలాశయం నుంచి విడుదలవుతున్న వరద నీరు దిగువున ఉన్న ఏలూరు నగరాన్ని ముంచెత్తుతోంది. రికార్డు స్థాయిలో వస్తున్న వరదనీరు ఏలూరునగరంలో భారీగా చేరుతోంది. 50శాతం నగరాన్ని వరద ముంచెత్తింది. అశోక్ నగర్, పత్తేబాద, రెండో పట్టణం, సుబ్బమపాఠశాల, డీమార్ట్, ఎస్ఎంఆర్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, మాదేపల్లి, శ్రీపర్రు, బాలయోగి వంతెన, ఆర్టీసీ కాలనీ, సంతోష్ నగర్ ప్రాంతాల్లో మూడు అడుగల మేర నీరు నిలిచింది. ప్రధాన రహదారుల్లో నీరునిలవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి సైతం నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

కొంగరవారిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయం నుంచి 20వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎర్రకాలువ వరదతో నల్లజర్ల, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడం ప్రాంతాల్లో లోతట్టు గ్రామాలు, పంటలు నీటమునిగాయి. గుండేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు, జల్లేరు, కొవ్వాడ వాగుల వరద వల్ల జిల్లాలో సుమారు 60వేల ఎకరాల్లో పంటల దెబ్బతిన్నాయి. వరి, మిరప, కూరగాలు, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 168నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. 80కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. డెల్టాలో ఉప్పుటేరు, యనపదుర్రు డ్రైన్లకు వరద నీరు పోటెత్తడంతో పరిసర ప్రాంతాల్లో వరిచేలు నీటమునిగాయి. ఆకివీడు, ఉండి, భీమవరం ప్రాంతాల్లో ఆక్వా చెరువులు నీటమునిగాయి.

ఇదీ చదవండి

పశ్చిమ గోదావరిపై వర్షాల పడగ.. ఊరూవాడా నీట మునక

ABOUT THE AUTHOR

...view details