పశ్చిమగోదావరి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నరసాపురం డివిజన్ పరిధిలోని ఐదు నియోజకవర్గాలు, 12 మండలాల పరిధిలోని 198 పంచాయతీలు, 1494 వార్డులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. 80.29 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కాళ్ల మండలంలో 85.19, అత్యల్పంగా పాలకోడేరు మండలంలో 76.21 శాతం పోలింగ్ నమోదయింది. నామినేషన్ దశలో 239 పంచాయతీల్లో 41 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 198 స్థానాల్లో పోటీ జరిగింది.
జిల్లాలోని 2,622 కేంద్రాల్లో ఉదయం 6.30గంటలకే పోలింగ్ ప్రారంభమైనా.. 7.30 గంటల నుంచి ఊపందుకుంది. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్న పంచాయతీల్లో మధ్యాహ్నం 12 గంటల్లోపే ఈ ప్రక్రియ ముగిసింది. పెద్ద పంచాయతీల్లో కూడా రెండు గంటల తర్వాత ఓటింగ్ జరగలేదు. ఇతర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన వారికి చాలా చోట్ల అభ్యర్థులే ప్రయాణ ఖర్చులు, అదనపు నగదు ఇచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులను, పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలను తీసుకొచ్చేందుకు అభ్యర్థులు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. బూత్ ఏజెంట్ల సమాచారంతో ఓట్లు వేసేందుకు రాని ఓటర్లను గుర్తించి వారిని తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు.
పలు చోట భోజనాలు
పోడూరు మండలం గుమ్మలూరు, తూర్పుపాలెం పంచాయతీల్లో సిబ్బంది మరుగుదొడ్లు సదుపాయం లేక అసౌకర్యానికి గురయ్యారు. ఉండి, భీమవరం మండలాల్లో కొందరు అభ్యర్థులు అనుమానం ఉన్న ఓటర్లకు ఓటేసేందుకు వెళ్లే ముందు కూడా నగదు పంచారు. కొన్ని చోట్ల షామియానాలు వేసి ఓటర్లకు భోజన ఏర్పాట్లు చేశారు.