RBK : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలతో నూర్పిడి చేయించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని.. రహదారులు, కాలువ గట్లు, చివరికి శ్మశానాలను చదును చేసుకుని ఆరబెడుతున్నారు. పౌరసరఫరాల శాఖ గత నెల 13నే మార్గదర్శకాలు జారీ చేసినా.. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించని ప్రభుత్వం.. ఆందోళనలో అన్నదాతలు
FARMERS : ఎండనకా వాననకా అహర్నిశలు శ్రమించిన అన్నదాతలు.. చేతికొచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో.. పొలాల్లోనే రోజుల తరబడి ఉంచలేక అవస్థలు పడుతున్నారు. తుపాను హెచ్చరికలతో.. పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.
కోసిన పంట రోడ్డుపై ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం సంచులు అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వం, అధికారులూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను వస్తే పంటంతా నీటిపాలవుతుందని భయపడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సంచులందించి, వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కొనుగోళ్ల డబ్బులను వీలైనంత త్వరగా చెల్లించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: