employees on prc : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేతన సవరణతో తమకు ఒరిగేది ఏమీ లేదంటున్నారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన చెందుతున్నారు. డీఏలు ఒకేసారి ఇవ్వడం వల్ల జీతాల్లో పెరుగుదల తప్ప కొత్త వేతన సవరణతో అదనంగా అందే జీతం ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కోసం వేయి కళ్లతో వేచిచూసిన తమకు ఇంత నిరాశాజనక పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం కన్నా పాత పీఆర్సీ కొనసాగిస్తూ ఇదే మధ్యంతర భృతితో, డీఏలన్నీ అమలుచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. అమల్లో ఉన్న పాత పీఆర్సీ, 27% మధ్యంతర భృతి, ఎప్పటినుంచో పెండింగులో ఉన్న కరవుభత్యం, పాత ఇంటి అద్దెభత్యం కలిపి లెక్కిస్తే కొత్త జీతం కన్నా పాత జీతమే ఎక్కువని చెబుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగి మాట్లాడుతూ తమకు ఇంటి అద్దెభత్యం, ఐఆర్, సీసీఏ రూపంలో దాదాపు 21% కోత పెట్టి, డీఏల రూపంలో 20.02 ఇచ్చారని, అంతకన్నా సాధించింది ఏముందని వ్యాఖ్యానించారు.
new PRC: కొత్త పీఆర్సీపై ఉద్యోగుల అసహనం.. - ఏపీ వార్తలు
employees on prc : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగులు ఆసహనం వ్యక్తం చేశారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన చెందుతున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం కన్నా పాత పీఆర్సీ కొనసాగిస్తూ ఇదే మధ్యంతర భృతితో, డీఏలన్నీ అమలుచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు.
money
కొందరు ఉద్యోగసంఘాల వారి విశ్లేషణ ఇలా..
- పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మూలవేతనం 30,580. పాత పీఆర్సీ ప్రకారం, ఐఆర్, మొత్తం డీఏలు, 20% హెచ్‌ఆర్‌ఏ కలిపి రూ.61,938 మొత్తం వేతనం వస్తుంది. ఈ ఉద్యోగికి డీఏ రూ.16,985, ఇంటి అద్దె భత్యం రూ.6,116, మధ్యంతర భృతి రూ.8,257 అందుతాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఆయనకు అందే మొత్తం జీతం రూ.60,284 మాత్రమే. అంటే రూ.1,654 నష్టపోతారు. ఈ ఉద్యోగికి కొత్త పీఆర్సీలో అన్ని లెక్కలూ వేశాక ఈయనకు వచ్చే మూలవేతనాన్ని తదుపరి దశలో ఉంచితే రూ.47,090గా ఉంటుంది. కరవుభత్యం రూ.9427, అద్దె భత్యం రూ.3,767 మాత్రమే అందుతాయి. ఇంతకుముందు అందుతున్న ఇంటి అద్దెభత్యం రూ.6,116గా ఉంటే తాజా పీఆర్సీలో రూ.3,767 మాత్రమే అందుతుంది. సీసీఏ లేనే లేదు.
- రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఒక సెక్షన్ ఆఫీసర్‌కు మూలవేతనం రూ.37,100. పాత పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం అన్నీ డీఏలూ అమలుచేసి, మధ్యంతర భృతి 27% ఇస్తూ, అమల్లో ఉన్న 30% హెచ్‌ఆర్‌ఏ పరిగణనలోకి తీసుకుంటే రూ.10,017 మధ్యంతర భృతి, రూ.11,130 ఇంటి అద్దె భత్యం, రూ.20,607 డీఏ మొత్తంగా వస్తూ మొత్తం రూ.78,854 అందుకుంటారు. అదే కొత్త పీఆర్సీలో కొత్త స్కేలు రూ.57,100గా ఉంటుంది. డీఏ రూపంలో రూ.11,431, ఇంటి అద్దె భత్యం రూ.9,136గా ఉంటుంది. మొత్తం జీతం రూ.77,667గా చేతికి అందుతుందని లెక్కిస్తున్నారు. అంటే నెలకు రూ.1,187 నష్టపోతారు.
- కర్నూలు జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో గతంలో ఇంటి అద్దె భత్యం 14.5%. అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి మూలవేతనం రూ.20,050. పాత పీఆర్సీ ప్రకారం ఐఆర్, హెచ్‌ఆర్‌ఏ, ఇవ్వాల్సిన మొత్తం డీఏలు అమలుచేస్తే ఆ ఉద్యోగికి ఇప్పుడు రూ.39,508 వేతనం వచ్చేది. కొత్త పీఆర్సీ అమలు వల్ల ఆయనకు రూ.39,468 వేతనంగా దక్కుతుంది. అంటే ఈ ఉద్యోగి విషయంలోను నెలకు రూ.40 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ఇంతకుముందు 10% హెచ్‌ఆర్‌ఏ ఉండి, ప్రస్తుతం 8%కు పరిమితమైన వారికి వారి స్కేళ్లను బట్టి కొద్దిగా ప్రయోజనం కనిపిస్తోంది.
- పై లెక్కల్లో సీసీఏ వల్ల నష్టపోతున్న మొత్తాలను కలపలేదు. సీసీఏ అన్ని చోట్లా, అందరు ఉద్యోగులకూ వర్తించదు. సీసీఏ అమల్లో ఉన్నచోట ఆ రూపంలో మరికొందరు ఇంకొంత నష్టపోతున్నారు.
ఇదీ చదవండి : 'ఈ పీఆర్సీ అసలే వద్దు.. పాత వేతనాలు, డీఏ ఇవ్వండి'