ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలసేమియా బాధితులకు అండగా.. ఆ ఇద్దరు

సేవ చేయాలనే తపన ఉంటే చాలు! ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ముందుకు సాగవచ్చు. ఈ మాటలు నిజం చేసి చూపిస్తున్నారు ఏలూరుకు చెందిన ఇద్దరు యువకులు. లాక్‌డౌన్​లో తగ్గిన రక్త నిల్వలను పెంచడానికి నడుం బిగించారు. కరోనాను సైతం లెక్క చేయకుండా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మేమున్నాం అంటూ భరోసానిస్తున్నారు.. ఇద్దరు మిత్రులు.

Eluru youths helping for thalassemia victims in west godavari district
తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్న ఏలూరు యువకులు

By

Published : Dec 19, 2020, 6:57 PM IST

తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్న ఏలూరు యువకులు

కరోనా విజృంభణతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. మెుదట్లో అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టడానికి ప్రజలు భయపడేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా, తలసేమియా బాధితులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య గుర్తించిన ఇద్దరు ఏలూరు యువకులు తమవంతు బాధ్యతగా రక్త సేకరణకు నడుం బిగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

అయ్యప్ప, కాళీ మస్తాన్‌ రావు రెడ్‌ క్రాస్‌ సొసైటీలో వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. నిత్యం.. స్థానిక విద్యార్థులు, యువకులతో రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు. ఆ రక్తాన్ని తలసేమియా బాధితులకు అందించేవారు. లాక్‌డౌన్‌ కారణంగా... రెడ్‌క్రాస్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఫలితంగా, రక్త నిల్వలు తగ్గి తలసేమియా వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అయ్యప్ప, కాళీ మస్తాన్‌రావులు రక్త సేకరణ కోసం జిల్లావ్యాప్తంగా పర్యటించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 180 మందికి పైగా తలసేమియా, 75మందికి పైగా సికెల్ సెల్ బాధిత పిల్లలు ఉన్నారు. వీరంతా ఏడాది వయసు నుంచి 17ఏళ్ల మధ్యలోపు వారే. తలసేమియా పిల్లలకు 15రోజులకు ఒకసారి 2 యూనిట్ల రక్తం ఎక్కించాలి. లేదంటే.. రక్తహీనతతో మరణించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ యువకులు అతికష్టంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిని ఒప్పించి.. రక్తాన్ని ఇచ్చేలా ప్రోత్సహించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రక్తదాతలు తలసేమియా కేంద్రాలకు రావడానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. బయటకు రాలేనివారికి...ఇంట్లోనే రక్తం సేకరించి తలసేమియా కేంద్రాలకు తరలించారు. అలాగే, మిత్రుల సహకారంతో జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి శిబిరంలోనూ 30నుంచి 40యూనిట్ల రక్తం సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అలా... ఇప్పటివరకు 600 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించారు.

అయ్యప్ప, కాళీ మస్తాన్‌ రావుల సహకారంతో...తమ పిల్లలకు సకాలంలో రక్తం అందిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఇద్దరి మంచి ప్రయత్నం వల్లే ప్రస్తుతం మా పిల్లలు క్షేమంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సమయంలోనూ ధైర్యంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన ఈ యువకులను స్థానికులు మెచ్చుకుంటున్నారు. తలసేమియా సమస్య ప్రతి జిల్లాలోనూ ఉంది. తమ వంతు బాధ్యతగా యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచిస్తున్నారు ఏలూరు రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 479 కరోనా కేసులు, 4 మరణాలు

ABOUT THE AUTHOR

...view details