కరోనా లాక్ డౌన్ కారణంగా గత 80 రోజులుగా ప్రజలకు దర్శనమివ్వని భగవంతుడు.. ఈనెల 8 నుంచి భక్తులను కనికరించబోతున్నాడు. ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఆలయాలన్నీ పునఃదర్శనాలకు సిద్ధమవుతున్నాయి.
ద్వారకా తిరుమలలో దర్శనానికి సర్వం సిద్ధం - ద్వారకాతిరుమల ఆలయం
దాదాపు రెండున్నర నెలలు... దేవాలయాల్లో సందడి లేదు.. భక్తుల నోట దైవ నామస్మరణ వినిపించలేదు. దీపారాధన వెలుగులు, టెంకాయ మోతలు, ప్రసాద వితరణలు ఏవీ కనిపించలేదు. విధిగా జరగాల్సిన కైంకర్యాలు మాత్రం అర్చక స్వాములు ఏకాంతంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి వలన.. గత 80 రోజులుగా దేవుని దర్శనానికి భక్తులు నోచుకోలేకపోయారు. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినందున ఈనెల 8 నుంచి దాదాపు రాష్ట్రంలోని అన్ని ఆలయాలలో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో ఈనెల 10 నుంచి భక్తులకు దర్శనం కల్పించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 8, 9 తేదీల్లో ఆలయ సిబ్బంది, స్థానికులకు ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించి.. 10వ తేదీ నుంచి సామాన్య భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు అన్నీ సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు గీయించారు. క్యూలైన్లలో శానిటైజర్లు పెట్టారు. ఆలయానికి వచ్చే భక్తులు గుర్తింపు కార్డు తీసుకురావాలని, తప్పనిసరిగా మాస్కులు పెట్టుకుని రావాలని సూచించారు.
ఇవీ చదవండి... సింహాచలం అప్పన్న దర్శనానికి.. సర్వం సిద్ధం