ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లిళ్లకు కరోనా దెబ్బ...ఏర్పాట్లపై పునరాలోచనలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. ఈ వైరస్ ఎఫెక్ట్ పెళ్లి వేడుకలపై పడింది. ముహూర్తం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చేసుకున్న ఏర్పాట్ల మేరకు చెయ్యగలమో లేదో.. మమ అనిపించాలా... వాయిదా వేయాలా...ఇదే ఆందోళన పెళ్లి నిర్వాహకులను వెంటాడుతోంది.

Covid Effect on Weddings
Covid Effect on Weddings

By

Published : May 2, 2021, 12:53 PM IST

ముహూర్తాలు పెట్టుకున్నాం.. అందరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చాం... మరో పది రోజుల్లో పెళ్లి...ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియడం లేదు... ఓ వధువు తండ్రి ఆందోళన ఇది.

కరోనా మహమ్మారి ఉద్ధృతి పెళ్లింట మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ముహూర్తం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చేసుకున్న ఏర్పాట్ల మేరకు చెయ్యగలమో లేదో.. మమ అనిపించాలా... వాయిదా వేయాలా...ఇదే ఆందోళన పెళ్లి నిర్వాహకులను వెంటాడుతోంది. పాలకొల్లుకు చెందిన అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా.. ఆమెకు గత డిసెంబరులో పెళ్లి నిశ్చయమైంది. అప్పటికి కరోనా కలకలం తగ్గడంతో అప్పట్లోనే ఈ నెల 30న వివాహం జరిపించడానికి ముహూర్తం పెట్టుకున్నారు. మూడు నెలల ముందే కల్యాణమండపం బుక్‌ చేసుకున్నారు. వరుడు ఈ నెల 15న స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కరోనా ఉద్ధృతి పెరిగింది. ఎంతో ఘనంగా చేద్దామనుకున్న పెళ్లి ఇపుడు 50 మందిలోపు ఆహ్వానితులతో జరిపించాల్సిన పరిస్థితి. అది కూడా పెళ్లి తేదీ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది వారి ఆందోళన. పల్లెల నుంచి పట్టణాల వరకు శుభకార్యాలు జరగాల్సిన చాలా ఇళ్లల్లో ఇపుడు ఇదే పరిస్థితి.

  • ఉంచాలా వద్దా

వేలకు వేలు అడ్వాన్సులు ఇచ్చి పురమాయించుకున్న కల్యాణ మండపాలు పెళ్లి కోసం ఉంచుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. తీరా రద్దుచేసుకున్నాక పరిస్థితి అనుకూలిస్తే కంగు తినాలేమోనని ఆలోచనలో మరికొందరున్నారు. మధ్యతరగతి కుటుంబాలైతే కల్యాణమండపాల జోలికి పోవడం తక్కువ కనిపిస్తోంది. వీలునుబట్టి పెళ్లి చేసుకుని అన్నీ అనుకూలించాక రిసెప్షన్‌ పెట్టుకుంటే మేలని భావిస్తున్నారు మరికొందరు. యలమంచిలిలోని కల్యాణ మండపం ఏటా ముహూర్తాల సమయంలో ఒక్కరోజూ ఖాళీ ఉండేది కాదు. ప్రస్తుతం ముహూర్తాల్లో రెండు రోజులు మాత్రమే ప్రస్తుతానికి బుక్‌ అయ్యిందని నిర్వాహకులు చెప్పారు.

మూఢం ముగియడంతో సోమవారం నుంచి వివాహాలకు వరుస ముహూర్తాలు మొదలవుతున్నాయి. ఆషాఢం వచ్చే వరకు ఎక్కువ మందికి అనుకూలమైన దాదాపు 20 ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల వరకు వివాహాలు సాధారణ రోజుల్లో జరుగుతుంటాయి. ప్రస్తుత కొవిడ్‌ నేపథ్యంలో కనీసం 4 వేల వరకు ఉంటాయనేది అంచనా.

  • మండపాలకూ

జిల్లాలో సుమారు 500కు పైగా కల్యాణ మండపాలున్నాయి. ఒక్క భీమవరంలోనే ప్రధానమైనవి 30 ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఇవన్నీ కళకళలాడుతూ కనిపించేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇక్కడి ఒక కల్యాణమండపంలో ప్రధాన ముహూర్తం ఉన్న రోజుల్లో కూడా ఖాళీగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు ‘గతేడాది ముహూర్తాల సమయంలో కొవిడ్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయాం. మళ్లీ సీజన్‌ వచ్చే సరికి కరోనా విజృంభిస్తుండడంతో పెళ్లి పందిళ్లు ఏర్పాటు చేసే తమలాంటి వారు తీవ్రంగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.’ అని కొవ్వూరు ప్రాంతానికి చెందిన పెళ్లి పందిళ్ల డెకరేషన్‌ నిర్వాహకుడు జి.మల్లేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఉపాధికి ఎసరు

వేడుకలపై ఉపాధి పొందే అందరికీ ప్రస్తుతం గడ్డుకాలమే. ‘ఈ సీజన్‌లో నిమిషం తీరికలేకుండా పనులుంటాయి. ఈ నెల 2, 5, 20 తేదీల్లో పెళ్లిళ్లకు ఫొటోలు అంతగా అవసరం లేదని కొందరు, వీడియో ఉంటే సరిపోతుందని కొందరు తన సిబ్బందికి ఉపాధి లేకుండా చేశారని వాపోయారు వడ్డిలంకకు చెందిన వీడియోగ్రాఫర్‌ మామిడిశెట్టి చిట్టిబాబు. యలమంచిలి మండలం కట్టుకాల్వకు చెందిన బ్యాండ్‌ మాస్టారుకు కొంతేరుకు చెందిన వ్యక్తి తన ఇంట్లో పెళ్లికి బ్యాండ్‌ వాయించాలని గత నెలలో అడ్వాన్సు ఇచ్చారు. ప్రస్తుతం బ్యాండ్‌కు అనుమతి లేకపోవడంతో తన బయానా సొమ్ము తిరిగి ఇవ్వాలని ఆయన అడగడంతో చిన్న పంచాయితీయే జరిగిందంటే నమ్మకతప్పదు.

  • ఏం చేయాలి

నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ఉపాధ్యాయుడు తన కుమార్తెకు ఈ నెల 5న వివాహం చేసేందుకు నిశ్చయించి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జరిపించలేక వేడుకను వాయిదా వేసుకున్నారు.

నార్నిమెరకకు చెందిన ఉపాధ్యాయుడొకరు కుమార్తె వివాహాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో జరపాలా వద్దానే సందిగ్ధంలో ఉండి స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కొవ్వూరుకు చెందిన ప్రభుత్వోద్యోగి సత్యనారాయణది కూడా ఇదే పరిస్థితి. ఈ నెల 29న జరగాల్సిన కుమార్తె వివాహ ఏర్పాట్లపై తర్జనభర్జనలు పడుతున్నారు.

పాలకోడేరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి బెంగళూరులో స్థిరపడిన యువకుడితో ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. విఘ్నేశుడి బియ్యం కట్టి పెళ్లి పనులు ప్రారంభించాలని ఇరువర్గాలవారు భావించారు. ప్రస్తుతం కర్ణాటకలో లాక్‌డౌన్‌ అమలవుతున్నందున అనుకున్న సమయానికి రావడం అయ్యేపని కాదని పెళ్లి వాయిదా వేయాలని వరుడి కుటుంబ సభ్యులు కబురు పంపారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వేడుకల్లోనే వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పెళ్లికి ఇరువైపులా 20 మంది మాత్రమే హాజరుకావడం ఉత్తమం. 15 రోజుల ముందు నుంచి వీరు జాగ్రత్తలు పాటించడం, ఎవరినీ కలవకపోవడం మేలు. కొత్త జంట పుష్పగుచ్ఛాలు, కానుకలు తీసుకోకపోవడం మంచిది. విందు కూడా పరిమితం చేయాలి. శానిటైజర్‌ను వినియోగించాలి. వృద్ధులను దూరంగా ఉంచాలి. జన సమూహం ఉండకుండా భౌతిక దూరానికే ప్రాధాన్యం ఇవ్వాలి.- ఏవీఆర్‌ మోహన్‌, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి

ఇదీ చదవండి:స్పందించని 104.. దిక్కుతోచని స్థితిలో విశాఖ వాసులు

ABOUT THE AUTHOR

...view details