ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మారిన ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు - బీబీఏ పరీక్షల్లో గందరంగోళం వార్తలు

పరీక్ష కేంద్రంలో ఒక ప్రశ్నపత్రానికి  బదులుగా ఇన్విజిలేటర్లు మరొకటి ఇచ్చిన ఘటన.. గందరగోళానికి దారి తీసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన.. పరీక్షకు హాజరైన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

Confusion with change in questionnaire in westgodavari district

By

Published : Nov 3, 2019, 11:43 AM IST

పరీక్ష కేంద్రంలో ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొకటి రావడం చూసి.. విద్యార్థులు అయోమయ స్థితిలో పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం వేగవరంలోని గీతాంజలి కళాశాలకు చెందిన సుమారు 20 మంది బీబీఏ కోర్సు విద్యార్థులకు... ఐదో సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు ఏలూరు సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాలను కేంద్రంగా కేటాయించారు. ఇటీవల శుక్రవారం నిర్వహించిన పరీక్షలో బీబీఏ విద్యార్థులకు బీకాం ప్రశ్నపత్రాన్ని ఇన్విజిలేటర్లు అందజేశారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన పొరపాటును గుర్తించిన వారు.. ఒకసారి ప్రశ్నపత్రాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మార్చడం వీలు కాదన్నారు. తప్పిదాన్ని నన్నయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చేసేదిలేక.. విద్యార్థులు పరీక్ష రాసి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఈ విషయమై వారు తమ తల్లిదండ్రులతో కలసి శనివారం సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. ప్రశ్నపత్రం మారిన విషయమై విశ్వవిద్యాలయానికి తెలియజేస్తామంటూ లేఖ రాసి తమకు ఇవ్వాలని కళాశాల వద్ద ఆందోళన చేశారు. విశ్వవిద్యాలయానికి తాము ఈ-మెయిల్‌ పంపామని.. లేఖ రాసి ఇవ్వడం వీలుకాదని కళాశాల యాజమాన్యం చెప్పడంపై వాగ్వాదం జరిగింది. పరిస్థితి తెలుసుకున్న సీఆర్‌ఆర్‌ విద్యాసంస్థల ప్రతినిధులు కళాశాల వద్దకు విచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులకు ఏవిధంగా నష్టం వాటిల్లకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై సీఆర్‌ఆర్‌ కళాశాల ప్రధానాచార్యురాలు శైలజ మాట్లాడుతూ రెండు కోర్సుల సిలబస్‌ ఒకటే అని తెలిపారు. ప్రశ్నపత్రాల బండిళ్లపై ఉన్న కోడ్‌ నంబర్‌ను సక్రమంగా పరిశీలించని కారణంగానే పొరపాటు జరిగిందన్నారు. ఈ విషయంపై విశ్వవిద్యాలయం ప్రతినిధులకు ఈ-మెయిల్‌ చేసినట్లు తెలిపారు.స్పందించిన ప్రతినిధులు విచారించేందుకు శనివారం ఒక అధికారిని పంపారన్నారు. వీసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.


ఇదీ చదవండి : 'ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే విపక్షాల ఐక్య పోరాటం'

ABOUT THE AUTHOR

...view details