గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా మొత్తం తెదేపాకు బ్రహ్మరథం పట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు కష్టం కలగకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని బాబు స్పష్టం చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని పునరుద్ఘాటించారు.
మోదీని చూసి.. జగన్ భయపడుతున్నారు
కేసులున్నాయనే జగన్ మోదీని చూసి భయపడుతున్నారని సీఎం అన్నారు. మోదీ ఇంటికి వెళ్తే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు. తాము లేకపోతే హైదరాబాద్ లేదనీ.. తమ జోలికి వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుందని కేసీఆర్‌ని ఉద్దేశించి అన్నారు. జగన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం గురించి కేసీఆర్‌కు ఎందుకు అని ప్రశ్నించిన బాబు... భద్రాచలం తమకివ్వాలనీ.. అది మునిగిపోకుండా మేమే కాపాడుకుంటామని తెలిపారు.
మహిళలే తెదేపాకు అండ
మహిళలకు శాశ్వతంగా రుణపడి ఉంటామనీ.. సేవ చేసే ప్రభుత్వాన్ని ఆదిరంచే బాధ్యత మహిళలదే అని ఉద్ఘాటించారు. పోలవరం ద్వారా 3 పంటలు పండించుకోవచ్చని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు.