గోదావరి వరదనీటిని సద్వినియోగం చేసుకొని... కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల రైతులకు మేలు చేకూర్చడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. గోదావరి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి.. రెండు జిల్లాలోని మెట్టప్రాంతాలైన 33 మండలాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. తాగు, సాగు నీరు, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ...17 వందల కోట్ల వ్యయంతో 2008లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా నేటికి పనులు మాత్రం పూర్తికాలేదు.
మూడు ప్రభుత్వాలు మారినా.. ఈ పథకం తలరాత మారలేదు. ఎత్తిపోతలు, కాలువ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. భూసేకరణ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండి అడ్డంకులు ఏర్పడ్డాయి. కాలువ తవ్వకానికి భూసేకరణ చేసే సమయంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ధర నిర్ణయించడం వల్ల.. న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. కృష్ణా జిల్లాలో ఎకరాకు 25లక్షల రూపాయలు చెల్లించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం 15 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల.. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆలస్యమయ్యేకొద్దీ.. ఈ పథకం వ్యయం పెరుగుతోంది. ప్రారంభంలో 17వందల కోట్ల రూపాయల అంచనా వేశారు. ప్రస్తుతం 4900 కోట్ల రూపాయలకు చేరుకొంది. ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడటం వల్ల.. కాలువ తవ్వకం పనులు నిలిపివేశారు. ప్రస్తుతం నాబార్డు 1900 కోట్ల రూపాయలు రుణం అందించడానికి ముందుకు వచ్చింది. న్యాయస్థానాల చిక్కుల వల్ల పనులు మందగించాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తికాకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని మెట్టప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.