మద్యపాన నిషేదం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ మండిపడ్డారు. కల్తీ సారా కారణంగా ఆడపడుచుల పుస్తెలు తెగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీసారా బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికీ రూ. 11 వేల చొప్పున అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో వెంటనే మద్యపానాన్ని నిషేదించాలని సత్య కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే జంగారెడ్డి గూడెంలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని..,లేనిపక్షంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.