ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 7, 2020, 1:56 PM IST

ETV Bharat / state

బడిలో బాలసాహిత్యం... పశ్చిమగోదావరి అధికారుల ప్రయత్నం

విద్యార్థుల్లో పఠనాసక్తి పెరిగేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో బాల సాహిత్యం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. సాహితీవేత్తలతో రచనలు చేయించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 15 మందిని ఎంపిక చేసి కార్యాచరణ చేపట్టారు.

bala sahityam in school education
పాఠశాలల్లో బాలసాహిత్యం

పశ్చిమ గోదావరి జిల్లాలో బాలల కోసం సాహితీవేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులతో ప్రత్యేక పుస్తకాలను రూపొందించే కార్యక్రమానికి విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో విద్యార్థులను భాగస్వాములను చేసి, జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా బాలసాహిత్యానికి రూపకల్పన చేస్తారు. వాటిని పాఠశాల గ్రంథాలయాల్లో పొందుపరుస్తారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, వారిలో గుణాత్మక మార్పు తీసుకురావాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. సాహిత్య రూపకల్పన కోసం జిల్లాలో 15 మందిని ఎంపిక చేసి కార్యాచరణ చేపట్టారు.

పాఠశాలల్లో గ్రంథాలయాల ఆవశ్యకతను 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక, 2009 విద్యా హక్కు చట్టం ద్వారా గుర్తించారు. గ్రంథాలయాల్లో ఎక్కువ సమయం గడుపుతూ కథల పుస్తకాలు చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయి అభ్యసనాలు కలిగి ఉన్నారని 2017లో నిర్వహించిన జాతీయ మదింపు సర్వేలో వెల్లడైంది. ఈనేపథ్యంలో గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పన, కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది. తాజాగా గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు కొత్త పుస్తకాలను సమకూర్చాలని నిర్ణయించింది.

బొమ్మల పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలు, ప్రత్యేక అంశాలకు చెందిన పుస్తకాలు, నిఘంటువులు, ఆడియో విజువల్‌ మెటీరియల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ విధానంపై పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లిస్తారు. ఇందుకు ప్రతి పాఠశాలలో రీడింగ్‌ కార్నర్స్‌, పోయమ్‌ కార్నర్‌, మెసేజ్‌ బోర్డులు, జానపద విభాగాలను ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల కోసం బాలసాహిత్యం, సెకండరీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కౌమార సాహిత్యం అందుబాటులో ఉంచుతారు. రచనల రూపకల్పన కోసం అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి (ఏఎంవో) కన్వీనర్‌గా, అసిస్టెంటు ఏఎంవో కోకన్వీనర్‌గా, జిల్లాలోని 15 మంది రచయితలు, ఉపాధ్యాయులతో కమిటీ ఏర్పాటు చేశారు. మరో ఇద్దరిని కార్యక్రమ సమన్వయకర్తలుగా నియమించారు.

పఠనాసక్తి పెరుగుతుంది

జిల్లా విశేషాలు పుస్తక రూపంలోకి వస్తే విద్యార్థుల్లో పఠనాసక్తి, భాషాజ్ఞానం పెరుగుతుంది. తద్వారా సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన పౌరులుగా ఎదుగుతారు. పుస్తకాల్లో ముద్రించాల్సిన అంశాల ఎంపిక పూర్తయింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలను ముద్రించి పాఠశాల గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తాం. - బొబ్బిలి రాజమౌళి కోటేశ్వరస్వామి, బాలసాహిత్యం జిల్లా సమన్వయకర్త

ఇదీ చదవండి: అన్​లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details