పశ్చిమ గోదావరి భీమడోలు ప్రచార సభలో చంద్రబాబు అవినీతిపరుడైన జగన్కు మోదీ కాపలా కాస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. చిన్నాన్ననే చంపి గుండెపోటని నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. విభజన చట్టం గురించి అడిగితే మోదీ సీబీఐ, ఈడీ,ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. విద్యుత్బకాయిలు అడిగితే కేసిఆర్ ఎదురుదాడి చేస్తున్నారని పశ్చిమగోదావరి భీమడోలు ప్రచార సభలో మండిపడ్డారు. ముగ్గురు మోదీల బెదిరింపులకు భయపడేది లేదని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల త్యాగాల వల్లే పార్టీకి గుర్తింపు వచ్చిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబం కంటే కార్యకర్తలే ఎక్కువన్నారు. భవిష్యత్తులో కార్యకర్తల అభివృద్ధికి ఇంకా కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు ఎలక్షన్ల తర్వాత ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మాదిరిగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం స్థానాలు తెదేపాకు ఇవ్వాలని ప్రజలను కోరారు. పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి చేసే పూచీ తనదని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి ఎన్నో పరిశ్రమలను ఆకర్షించామన్నారు. జగన్ను గెలిపిస్తే ఉన్న కంపెనీలు తిరిగివెళ్లిపోతాయని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో కంపెనీల పేరుతో ఎంతో అవినీతి జరిగిందన్నారు.మూడు పూటలా మన ఓటు ఉందో... లేదో.. చూసుకునే స్థితికి జగన్ తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. బీహార్ నుంచి పీకేను తీసుకొచ్చిమరీ ఓట్లు గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు. పీకే ఆటలు ఏపీలో చెల్లవని మండిపడ్డారు. వైకాప నేతలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని తూర్పారబట్టారు.