ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యం కోసం ఇస్తున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ వైల్స్‌ను ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. బయట వ్యక్తుల సహాయంతో అక్రమంగా తరలిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెమిడెసివిర్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా అరెస్టు - remdesivir injection in black market news update
కరోనా రోగులకు అందించాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను.. అక్రమంగా బయట వ్యక్తులకు విక్రయిస్తున్న పది మంది ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నారాయణ నాయక్ వారి వివరాలను వెల్లడించారు.
ఆస్పత్రిలో పనిచేస్తున్న వేల్పూరి రేఖాదేవి, సకినాల రమేష్, గారపాటి సులోచన, గుడిపాటి రాజేష్, కెల్లా పూర్ణచంద్రరావు, డొల్లా సుధాకర్, గూడపాటి సురేష్, చిగురుపల్లి అరుణ, కడగాలి అనురాధ, శీలవలస రమణ అనే 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఏస్పీ నారాయణ నాయక్ వెల్లడించారు. ఇందులో ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు టెక్నిషియన్స్, మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. వీరి వద్ద నుంచి 27 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, 15 ఖాళీ వైల్స్‌ను, రూ.1.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన డీఎస్పీ దిలీప్ కిరణ్, సీఐ అనుసూరి శ్రీనివాసరావు, ఎస్సై చావా సురేష్, ఇతర మెడికల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి...:సర్వాంగ సుందరంగా ఏపీ నిట్