సాగు యాంత్రీకరణ జరగాలని అధికారులతో జరిపే సమీక్షల్లో ఎప్పటికప్పుడు చెబుతారు. త్వరలోనే రైతు ఆధారిత యంత్రాలను అందిస్తున్నాం అంటారు. గతేడాది మే 12న వ్యవసాయ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధిపై జరిగిన సమీక్షలోనే ముఖ్యమంత్రి జగన్ ఇదే మాట చెప్పారు. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాటలు నీటిమూటలే అయ్యాయి. రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లూ కూడా ప్రభుత్వం అందివ్వలేకపోయింది.
రాష్ట్రంలో 7 లక్షల 13 వేల 150 మంది రైతులకు ఆర్‌బీకే యూనిట్‌గా టార్పాలిన్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్ ఆధారిత యంత్రాలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని ముఖ్యమంత్రి జగన్ గతేడాది సెప్టెంబర్ 8న వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షలో వెల్లడించారు. లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి 80 శాతం, ఇతరులకు 20 శాతం రాయితీపై అందిస్తామని చెప్పారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఎస్టీలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఖరీఫ్ పంటకాలం ముగిసింది. రబీ సీజన్ అప్పుడే సగం అయిపోయింది. అయినా ఒక్క రైతుకూ స్ప్రేయర్, టార్పాలిన్ అందలేదు. అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు ఈ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. ముఖ్యమంత్రి చెప్పినందున నాలుగో ఏడాదిలోనైనా ఇస్తారని ఆశించిన అన్నదాతలకు నిరీక్షణ, నిరాశే మిగిలాయి.
రాయితీగా ఏడాదికి 150 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. అధిక మొత్తాన్ని వెచ్చించి టార్పాలిన్లు, తైవాన్ స్ప్రేయర్లను కొనుక్కోలేని చిన్న, సన్నకారు రైతులకు యాంత్రీకరణ పథకం కొన్నేళ్లుగా ఎంతో ఉపయోగపడుతోంది. ఎకరం, అరెకరం పొలం ఉన్న వారితో పాటు కౌలుదారులకు రాయితీపై వీటిని అందించేవారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, వాటి ఆధారిత పరికరాలనూ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తొలి మూడేళ్లు వీటి పంపిణీని మానేసింది. యంత్ర సేద్యాన్ని ప్రోత్సహిస్తూ కేంద్రం ఇస్తున్న నిధులను ఆర్‌బీకేల వారీగా ఇచ్చే అద్దె యంత్రాల కేంద్రాలకే మళ్లించింది. దీనిపై రైతుల అసంతృప్తిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2022-23లో ఈ పథకం అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించినా.. ఆచరణలోకి రాలేదు. అద్దె యంత్రాల కేంద్రాల ఏర్పాటుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.