Alluri Family: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలకు తమను సాదరంగా ఆహ్వానించడాన్ని ఎన్నటికీ మరువలేమని.. అల్లూరి సీతారామరాజు వంశీయులు పేర్కొన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను ఒకే వేదికపైకి చేర్చడం, ప్రజలందరికీ తెలియజేయడం సంతోషకరమని వెల్లడించారు.
అల్లూరి వంశీయులమన్న విషయాన్ని తాము ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని, తమ పని తాము చేసుకుంటూనే ఇన్నాళ్లూ జీవనం సాగించామని తెలిపారు. అల్లూరి జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వంశీయులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. అల్లూరి అనుచరుల్లో ఒకరైన గంటం దొర వారసులైన బోడి దొర కుటుంబ సభ్యులూ వచ్చారు.
శ్రీరామరాజు పేర్లే..మా కుటుంబంలో కొందరి పేర్లు శ్రీరామరాజు అనే ఉంటాయి. మా నాన్న సత్యనారాయణరాజు కంటే సీతారామరాజు పెద్దవారు. నాన్న వృద్ధాప్యంలోనూ తన అన్ననే తలచుకునేవారు.
ఏ ప్రాంతంలోనైనా అల్లూరి వేడుకలు జరుగుతుంటే వెళ్లేవారు. సీతారామరాజుకు తమ్ముడినని చెప్పేవారు కాదు. జనంలో ఉంటూ చూసి ఆనందించేవారు. భవిష్యత్తు తరాలకూ శ్రీరామరాజు అనే పేరే ఉండాలని కోరేవారు. - పత్సమట్ల సత్యవతి, అల్లూరి సోదరుడి కుమార్తె, కాకినాడ
అన్నతో ఉద్యమంలోకి వెళ్లి..అల్లూరి సత్యనారాయణరాజు మా మావయ్య. ఆయనకు, సీతారామరాజుకు మధ్య సీతమ్మ అనే సోదరి ఉన్నారు. సీతారామరాజు మన్యంలో ఉన్నప్పుడు తానూ వెళ్లానని, కొద్దిరోజుల తర్వాత తిరిగొచ్చేశానని మా మావయ్య చెప్పేవారు.