రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు సమర్ధంగా చేపడుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ ఆళ్ల నాని విమర్శించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై చేస్తున్న బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల కారణంగా వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని మంత్రి అన్నారు. కరోనాకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఏ విషయంపైనా చంద్రబాబుకు అవగాహన లేదని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉన్నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా లోటు లేకుండా చూస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. తెదేపా అధికారంలో ఉండగా 5 వేల వైద్యుల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా బాగు చేయలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు సైతం నిలిపివేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టారని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.300 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు.