పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. కొవ్వూరులో నిన్న సాయంత్రం సినిమాకు వెళ్లిన ఆరుగురు యువకులు.. తిరుగు ప్రయాణంలో గోష్పాద క్షేత్రం దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురు తినుబండారాలు తీసుకురావడానికి వెళ్లగా.. మరో ముగ్గురు నదిలో స్నానానికి దిగారు.
ఆ ముగ్గురూ.. ప్రవాహ ఉద్ధృతికి గల్లంతైనట్టు తెలుస్తోంది. గట్టు వద్ద కనిపించిన వారి దుస్తుల ఆధారంగా.. నది సమీపంలో పోలీసులు గాలింపు చేపట్టారు. గోష్పాద క్షేత్రం వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి మృత దేహం లభ్యమైంది. గల్లంతైన మిగతా ఇద్దరు హేమంత్, సోమరాజు కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ఆరుగురినీ చాగల్లుకు చెందిన వారిగా గుర్తించారు. సత్యనారాయణ మృత దేహం వద్ద కుటుంబీకుల రోదన.. కంటతడి పెట్టించింది.