మాన్సాస్ ట్రస్టు(Mansas trust) ఛైర్మన్ పదవిపై హైకోర్టు తీర్పు తరువాత.. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా తెదేపా నేతలు స్పందించారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌పై ప్రభుత్వం జారీ చేసిన 71, 72, 73, 74 జీవోలు తప్పుడు ఆలోచనతో ఇచ్చినట్లు రుజువైందని తెదేపా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. వాస్తవాలు పక్కనపెట్టి మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మాన్సాస్ ట్రస్టు(Mansas trust) నిర్వహణలో తప్పులు జరిగితే.. సంచైత ఛైర్మన్‌గా 14 నెలలు వారి అధీనంలో ట్రస్టు ఉండగా.. అప్పుడు ఎందుకు విచారణ చేయలేకపోయారని ప్రశ్నించారు. తూర్పు గోదావరిజిల్లాలోని ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు సంచైత సంతకం పెట్టారు.. ఇప్పుడు ఆమెను అరెస్టు చేయగలరా అని ఆయన ప్రశ్నించారు.
సంచైతను పిలిచి అవమానించింది వైకాపా నేతలే..
ఆకాశం మీది ఉమ్మేస్తే ఏమవుతుందో.. విజయసాయిరెడ్డికి అర్థం కావడం లేదని అరకు తెదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పును కూడా వక్రీకరించి మాట్లాడటం వారి మానసిక స్థితిని తెలియజేస్తోందన్నారు. వేల ఎకరాల ఆస్తులను ధానమిచ్చిన కుటుంబం పూసపాటి వంశం వారిది, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు అక్రమాలకు పాల్పడ్డారంటే ప్రజలు నమ్ముతారా అని ఆమె అన్నారు. విజయసాయిరెడ్డి జైలుకి వెళ్లి రావడం వల్ల.. పదేపదే అందరినీ జైలుకు పంపుతామంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఎక్కడో తన పని చేసుకుంటున్న సంచైతను తీసుకొచ్చి రాజకీయపావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగింది.. అశోక్ మహిళను అగౌరవపరిచారని వైకాపా నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవంగా సంచైతను అవమానపరిచింది.. వైకాపా నేతలేనని సంధ్యారాణి అన్నారు.