'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న తెదేపా అధినేత నారా చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. కార్యక్రమం నిర్వహణపై విజయనగరం జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడేళ్లుగా రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వైకాపా పాలనలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. వివాదరహితుడిగా పేరున్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుని కూడా వదల్లేదన్నారు. మాన్సాస్ ఆస్తుల విషయమై ఆయన్ను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. తాజాగా లోకేశ్ పదో తరగతి విద్యార్థులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో వైకాపా నేతలు దొంగల్లా ప్రవేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీడుకోకపోవటం హాస్యాస్పదమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బుద్ధా డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఇప్పటి వరకు 7 ప్రాంతాల్లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. బాదుడే బాదుడు, మహానాడుకు వచ్చిన స్పందన చూసి అధికార పార్టీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే.. మంత్రుల బస్సుయాత్ర, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా కార్యక్రమాలకు వ్యతిరేకంగా అధికార వైకాపా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.., ఈ ప్రభుత్వాని ఓడించేందుకు ప్రజలు అత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.