ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేము ఒడిశాలోకి వస్తాం.. సిరివర గిరిజనుల అభ్యర్థన - Special meeting in Kodama village at vizianagaram district news update

ఆంధ్రా అధికారులు, ప్రజా ప్రతినిధులతో విసిగిపోయామని తమను ఒడిశాలోకి తీసుకోవాలని.. సిరివర గిరిజనులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శిఖరాగ్ర గ్రామ పంచాయతీ కొదమలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమకు రహదారి సౌకర్యం కల్పించాలని.. పాఠశాలలను నడిపించాలని.. వైద్య సౌకర్యాలు అందించాలని కోరుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Special meeting in Kodama
కొదమలో ప్రత్యేక సమావేశం

By

Published : Mar 25, 2021, 1:38 PM IST


స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఊరికి రోడ్డు లేదు.. పిల్లలకు చదువు లేదు.. గర్భిణులకు ప్రసవాల సమయంలో సరైన వైద్యం అందదు.. ఇన్నాళ్లుగా ఒక్క ఆంధ్రా ఎమ్మెల్యే, ఎంపీ, ఉన్నతాధికారి అయినా మా ఊరికి రాలేదు.. మా వైపు చూడలేదు.. అందరికీ అందని అమ్మఒడి.. సగం మందికే రైతు భరోసా.. రెండు నెలలుగా రేషన్‌ సమస్యలు ఉన్నా తీర్చేవారే లేరు. పాఠశాల ఉన్నా ఉపాధ్యాయులు రారు.. అంగన్‌వాడీ భవనాలూ ఉండవు.. ఏపీ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు.. అందరం ఒడిశాలోకి వచ్చేస్తాం ఇది సిరివర గిరిజనుల ఆవేదన.

ఒక్కసారి కొఠియాను చూడండి.. ఎంత అభివృద్ధి చేశామో.. మీరు ఆంధ్రాలో ఉండొద్ధు. పరిపాలన నచ్చలేదని మీ పాలకులకు చెప్పండి.. మీకు మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత మాది ఇదిఒడిశా మాజీ ప్రజాప్రతినిధుల భరోసా.

సాలూరు మండలంలోని కొదమ పంచాయతీ సిరివరలో తెదేపా నాయకుడు మాలతీదొర ఆధ్వర్యంలో బుధవారం ఒడిశా మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. గిరిజనులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆంధ్రా పాలకుల్ని విమర్శించారు. పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొరకు సిరవర ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించారు. గ్రామంలో రహదారులు వేసి చూపిస్తామని, విద్య, వైద్యాన్ని చేరువ చేస్తామని హామీ ఇచ్చారు. 2018 జులైలో ఓ గర్భిణిని 9 కిలోమీటర్లు తీసుకువెళ్లడంపై మానవహక్కుల సంఘం జిల్లా యంత్రాంగానికి అక్షింతలు వేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. అనంతరం గిరిజనులు మాట్లాడుతూ.. తమను ఒడిశాలో కలుపుకోవాలని కోరారు. ఒడిశా మాజీ ఎంపీ, మాజీ మంత్రి జయరామ్‌పంగి, విశ్రాంత కలెక్టరు పోరతి, పొట్టంగి బ్లాక్‌ ఛైర్మన్‌ జగత్‌జ్యోతిపంగి, సిమిలిగూడ బ్లాక్‌ మాజీ ఛైర్మన్‌ ఎస్‌.నారాయణ, విజయనగరానికి చెందిన భాజపా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

టీబీ ఓడిపోతుంది... దేశం గెలుస్తుంది!

ABOUT THE AUTHOR

...view details