గిరిజన ప్రాంతంలో సరైన సదుపాయాల్లేక మాతాశిశు మరణాలు ఎక్కువ. రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఘోరం. వీటి అదుపు కోసం పార్వతీపురం ఐటీడీఏ వినూత్నంగా గర్భిణులకు వసతి గృహాలు ఏర్పాటు చేసింది. ఐటీడీఏ పీవో లక్ష్మీశ ఆలోచనకు ప్రతిరూపమే గుమ్మలక్ష్మీపురం, సాలూరులోని ఈ గృహాలు. ఈ కేంద్రంలో 8 నుంచి 9 నెలలలోపు ఉన్న గర్భిణీలకు సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఓ ఆరోగ్య కార్యకర్త 24 గంటలూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఓ వాహనం సిద్ధంగా ఉంటుంది. పురిటినొప్పులు వచ్చినా... అనారోగ్యంపాలైనా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్తారు. ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు, రోజూ మెను ప్రకారం పోషకాహారం అందిస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయిస్తారు. ఒక్కో గర్భిణీకి నెలకు సగటున 3వేలు ఖర్చుచేసి సురక్షిత ప్రసవాలనకు బాటలు వేస్తున్నారు. ఇలాంటి ప్రసవాలు సాలూరులో వందకుపైగా జరిగితే గుమ్మలక్ష్మీపురం వంద మార్కు అందుకుంది
గిరిశిఖర వసతి గృహాలు... గర్భిణులకు అమృత హస్తాలు
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు, పోషకాహార లోపాలు అధిగమించేందుకు విజయనగరం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న గర్భిణుల వసతి గృహాలు.. నీతి ఆయోగ్ దృష్టిని ఆకర్షించాయి. జిల్లాలోని పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వినూత్నంగా నడుస్తున్నాయీ కేంద్రాలు. ఇక్కడ గర్భిణులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి ఈ వసతి గృహాలు చూసి... ఇదే ఆలోచన దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేనా పార్వతీపురం ఐటీడీఏలో వసతి గృహాల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించడానికి హామీ ఇచ్చారు.
నీతిఆయోగ్ బృందం సందర్శన
సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన గిరిశిఖర వసతి గృహాలను కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి సందర్శించారు. ఇదే విధానాన్ని గిరిజన ప్రాంతంలో అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు నీతి అయోగ్ ప్రతినిధుల బృందం... ఈ గృహాలను ఇటీవలే పరిశీలించారు. వసతి గృహాల ఏర్పాటు, అమలు తీరు, ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసి... దేశవ్యాప్త అమలకు ప్రతిపాదిస్తామన్నారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు.
పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో నడుస్తున్న గిరిశిఖర గర్భిణుల వసతి గృహాలు నీతి అయోగ్ మెప్పు పొందగలిగితే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు వీలు కలుగుతుంది. ఇదే జరిగితే పార్వతీపురం ఐటీడీఏ దేశానికి ఆదర్శప్రాయం కానుంది.