పార్వతీపురం మండలం అడారుగెడ్డ మినీ జలాశయం
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజనులో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. రూ.500 కోట్లు ఖర్చు చేస్తే ఆగిన పథకాలను పూర్తి చేయొచ్చునని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా పనులు నిలిచిపోవడానికి కారణాలు ఏమిటని చర్చించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న కాలంలో టీఎస్పీ నిధులతో పనులు మంజూరయ్యాయి. వాటిని చేయడానికి ముందుకు వెళ్దామంటే అవసరమైన మేర భూమి లేదు. దీంతో ఈ పనులు జరగక....పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యలోనే వదిలేయడంతో....: పథకాల పూర్తికి అవసరమైన భూమిని గుత్తేదార్లకు అందించలేకపోవడం వల్ల చాలా పనులను వారు మధ్యలోనే విడిచి వెళ్తున్నారు. 15 ఏళ్లుగా నిలిచిన వాటి ప్రారంభానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణను తొలుత పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. దీంతో సబ్‌కలెక్టరు విధేఖరే డివిజనులోని చిన్ననీటి పథకాలను సందర్శించి, తహసీల్దార్లకు పలు సూచనలు చేశారు.