ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2021, 5:46 PM IST

ETV Bharat / state

ఏకగ్రీవ నాయకుడికి అవి లేకుంటే పల్లెకే నష్టం

ఏకగ్రీవం.. ఏ ఎన్నికల్లోనూ ఈ మాట ఇంతలా వినిపించలేదు. ప్రభుత్వం కూడా ఇందుకోసం ముందుకొచ్చిన పంచాయతీలకు తాయిలాలూ ప్రకటించింది. స్వచ్ఛందంగా ప్రజలే ఏకతాటిపైకి వచ్చి నాయకుడ్ని ఎన్నుకుంటే ఫర్వాలేదు. కొన్నిచోట్ల ఈ వ్యవహారం అపహాస్యమవుతోంది. బెదిరింపులకు పాల్పడుతూ ప్రత్యర్థులు బరిలోంచి తప్పుకొనేలా చేస్తున్నారు. అసలు ఏకగ్రీవంగా పాలకుడు కావాలంటే ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉన్న వారిని ఎన్నుకోవాలి? ఇప్పుడు ఓటరు ఆలోచించాల్సిన అంశాలివి.

qualities in Consensus person at local elections
ఏకగ్రీవ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు

పదవి కోసం వేలంపాటలు మొదలయ్యాయి. అభివృద్ధి పేరుతో డబ్బులిచ్చి పదవిని మూటకట్టుకుంటున్నారు. ఆశావాహులను కూర్చొపెట్టి ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవీ కుదరకపోతే బలవంతంగా, బెదిరింపులకు పాల్పడుతూ ప్రత్యర్థులు బరిలోంచి తప్పుకొనేలా చేస్తున్నారు. అసలు ఏకగ్రీవంగా పాలకుడు కావాలంటే ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉన్న వారిని ఎన్నుకోవాలి? ఇప్పుడు ఓటరు ఆలోచించాల్సిన అంశాలివి.

నామపత్రం.. జర భద్రం

పంచాయతీ పోరుకు తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం మంగళవారం నుంచి మొదలు కానుంది. జిల్లాలో రెండో విడతగా మొదటిదశలో పార్వతీపురం డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను యంత్రాంగం చేపడుతోంది. ఈతరుణంలో అభ్యర్థులు పత్రాలు ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురై పోటీ చేసేందుకు అవకాశం దక్కని పరిస్థితులు ఉండవచ్ఛు ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామపత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాకే సమర్పించాలి. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను ఆశ్రయించి ముందుగానే అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. అన్నీ సరిచూసుకున్నాక ఆర్‌వోకు సమర్పించాలి.

అప్రమత్తం కాకుంటే తిరస్కరణే..

వార్డు సభ్యుడిగా ఓ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయడానికి అవకాశం లేదు. సర్పంచిగా పోటీచేసే వారిని ప్రతిపాదించే వ్యక్తి తప్పనిసరిగా ఆ పంచాయతీలో ఓటరై ఉండాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన సంసిద్ధతను తెలియజేస్తూ నామపత్రంలోని డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. పత్రాలను ఆర్‌వోకు అందజేసిన తర్వాత రసీదు తీసుకోవాలి. దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు ప్రతిపాదకుడు, మరొకర్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రిజర్వుడు అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ప్రతి అభ్యర్థీ నామపత్రంతోపాటు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు ఉంటే వాటి వివరాలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతకు సంబంధించిన పత్రాలు ఇద్దరు సాక్ష్యుల హామీతో పాటు ప్రత్యేకంగా డిక్లరేషన్‌ సమర్పించాలి. నామినేషన్ల ధరావత్తును బ్యాంకు చలానా రూపంలో గానీ, నగదుగా గానీ చెల్లించవచ్చు

త్యాగం, సేవాగుణం ఉందా?

ఏకగ్రీవంగా సర్పంచి పదవిని ప్రతిపాదించే వ్యక్తిలో మొదట చూడాల్సింది సేవా గుణం. కోడిపిల్లను చూపించి, కోడిపుంజును పట్టుకుపోయే నైజం ఉన్న వారే ఇప్పుడు ఎక్కువగా రాజకీయాల్లో కనిపిస్తున్నారు. పంచాయతీలో పెద్దగా కూర్చొని పది మంది హితం కోసం పని చేయాల్సిన ప్రథమ పౌరుడిలో కొంతైనా త్యాగనిరతి ఉండడం అనివార్యం. తమ సంపదను ప్రజల కోసం ధారపోసిన వారు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నారు. వారిలోని ఇసుమంతైనా త్యాగభావం, సేవాగుణం ఉన్న వారు గ్రామాల్లో ఉంటే వారిని తెరమీదకు తీసుకువచ్చి, సర్పంచిగా సేవ చేసే అవకాశం ఇవ్వడానికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇవేమీ లేకుండా డబ్బులతో పదవులను తెచ్చుకుంటే దాని వెనకున్న ఆంతర్యం అర్థం చేసుకోవాల్సిందే.

నీతి, నిజాయతీలే గీటురాయి

గ్రామంలో నీతికి, నిజాయతీకి గీటురాయిగా నిలిచే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పల్లెసీమలు అభివృద్ధిబాట పడతాయి. పెద్దల మాటకు తలొగ్గి గతంలో ఎన్నో పంచాయతీల్లో ఎన్నికలు లేకుండా పాలకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డబ్బులు ఎరచూపి మరికొందరు గద్దెనెక్కారు. వారు ఎలా పనిచేశారో ఇప్పటికే తెలిసొచ్చి ఉంటుంది. వచ్చిన నిధులను లెక్కా పత్రాం లేకుండా వెచ్చించి ప్రజలుఇచ్చిన అవకాశాన్ని నీరుగార్చి జేబులు నింపుకొన్న ఏకగ్రీవులు మనకు అక్కడక్కడా తారసపడతారు. డబ్బులిచ్చి పదవిని కొనుక్కున్నామనే రీతిలో కాస్తంత గర్వాన్ని ప్రదర్శించి నీతిని గాలికొదిలిన వారూ ఉంటారు. పంచాయతీ నిధులను ప్రజల హితానికి నిజాయతీతో ఖర్చు చేసే గుణవంతుల్ని పోటీ లేకుండా గద్దె ఎక్కిస్తే పల్లెల్లో ప్రగతిరాజ్యం వికసిస్తుంది.

విద్యావంతులకు అవకాశంగా...

ప్రజాస్వామ్య వ్యవస్థలో చిరుద్యోగికి విద్యార్హత అవసరం కానీ, రాజకీయాల్లో ఎంత పెద్ద పదవిని అధిష్ఠించేవారికైనా విద్య అవసరం లేని పరిస్థితి ఉంది. విద్యావంతుల చేతికి పాలనాపగ్గాలు ఇస్తే గ్రామసీమలు అభ్యుదయ గీతాలను ఆలపిస్తాయి. మంచి చెడుల విచక్షణ, మంచిని స్వీకరించే గుణం, సద్విమర్శలను దీవెనల్లా స్వీకరించే నైజం ఉన్న విద్యావంతులకు పోటీతో నిమిత్తం లేకుండా సర్వజనామోదంతో పాలన అప్పగించాలి. అప్పుడే స్థానిక స్వపరిపాలనకు అర్థం చెప్పేదిశగా పల్లెలను నడిపించి, బాపుజీ కన్న కలలను సాకారం చేసే ప్రయత్నానికి బీజం పడుతుంది.

సానుకూల పరిష్కారాలు..

పల్లెల్లో నెలకొన్న సమస్యలు తెలిసి, వాటికి పరిష్కారాన్ని ఆలోచించగలిగే నేర్పరిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. స్థానిక సమస్యలపై అవగాహన లేని వారిని ఎవరో చెప్పారని, ఏదో ఇచ్చారని ఆలోచనరహితంగా బాధ్యతలు అప్పగిస్తే పల్లెల హితానికి చేటు జరుగుతుంది. కనీససౌకర్యాలు కల్పించడానికి ఉన్న వనరులు తెలుసుకొని, వాటిని వినియోగించుకొనే ఆలోచనలను కార్యరూపంలో అమలుచేయగలిగే ఆలోచనాపరులకు అందరూ ఒక్కటిగా అవకాశం కల్పిస్తే పల్లెసీమలు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

లెక్కలు చెప్పకుంటే వేటు తప్పదు..

పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సిందే. జనాభా ప్రాతిపదికన ఆయా పంచాయతీల అభ్యర్థులు ఎంత వ్యయం చేయాలో ఎన్నికల సంఘం స్పష్టంగా తేల్చి చెప్పింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేల జనాభా ఉన్న పంచాయతీ అయితే సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేలు మాత్రమే వ్యయం చేయాలని నిర్ణయించారు. పదివేల లోపు పంచాయతీ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. నామపత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థి వ్యయం చేసే ప్రతి పైసా లెక్కలు చూపించాలి. ప్రతి అభ్యర్థి ఒక నగదు పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రోజువారీ ఎంత ఖర్చు చేసింది చూపించాలి. ఖర్చులకు రసీదులు పొందపరచాలి. పోటీలో ఉన్నవారు వ్యయం చేసే మొత్తాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉండరు. రిటర్నింగు అధికారి మాత్రమే పరిశీలిస్తారు. ఆయనకు తగు వివరాలను రెండు రోజులకోమారు సమర్పించాలి. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపు వ్యయానికి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలో అందజేయాలి. ఆ తర్వాత కూడా ఇవ్వకపోతే ఎన్నికల వివరాల ఖర్చులు సమర్పించాలని అధికారులు నోటీసు ఇస్తారు. అప్పటికీ స్పందించకుంటే ఎన్నికల్లో విజయం సాధించి ఉంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఓడిపోతే మరో దఫా పోటీచేసేందుకు వీలు లేకుండా అనర్హతగా ప్రకటిస్తారు. అందుకే అభ్యర్థులు ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిందే.

అందరిలో ఒకడిగా..

సర్పంచి అంటే మనలో ఒకడిగా మనకోసం పరిశ్రమించే వ్యక్తిగా ఉండాలి. స్వగ్రామం హితం కోసం పరితపించే తత్వం నిండుగా కనిపించాలి. తాను ప్రత్యేకమైన వ్యక్తిని, నాయకుడినని తనకుతానుగా గిరి గీసుకొని ఉండకుండా, అందరితో కలిసిమెలిసి నడిచే గుణం ఉండాలి. సమస్యలపై అందరితోను చర్చించి, ప్రజామోద పరిష్కారాన్ని చూపించగలిగే తెలివి ఉన్న వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. అలా కాకుండా రాజకీయాలను తలకెత్తుకొని, గ్రామాన్ని తాకట్టు పెట్టే వారిని ఎన్నుకుంటే పరపాలనకు చోటిచ్చినట్లే అవుతుంది.

దురుద్దేశం లేకుండా..

పదవి చేతికి చిక్కిందంటే ఖజానా తాళాలు చేతికి వచ్చినట్లే భావించే వారే ఎక్కువ. ఏరాజకీయ పదవికీ లేని ఆర్థికపరమైన బాధ్యతలు సర్పంచికి మాత్రమే ఉన్నాయి. అందుకే ఐదేళ్లలో నాలుగురాళ్లు వెనుకేసుకోవాలనుకొని పదవిలోకి వచ్చే వాళ్లే అధికంగా ఉంటున్నారు. ఇటువంటి దురుద్దేశం ఉన్నవారిని దూరంగా పెట్టాలి. ప్రజాసేవకు సిద్ధమయ్యేవారికి పాలనాపగ్గాలు అప్పగించాలి.

విజ్ఞత.. దక్షత..

ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అర్హతలుగా విజ్ఞత, దక్షత రెండూ ఉండాలి. విజ్ఞత లేని వారికి వినయం ఉండదు. ఈ రెండు లేకపోతే ఆలోచనలు సక్రమమార్గంలో సాగవు. అందుకే విజ్ఞతతో కూడిన వివేకవంతులు అభ్యర్థులుగా లభిస్తే వారికోసం ఏకగ్రీవ మంత్రం పఠించి పల్లె సిగలో ప్రగతి కుసుమాలు పూయించే ప్రయత్నం చేయవచ్ఛు కార్యసాధనలో దక్షత ఉండి, ప్రజలకు అవసరమైన పనులను సాధించుకొనే మార్గం తెలిసిన వ్యక్తికి పంచాయతీ బాధ్యతను అప్పగించడంలో భవిష్యత్తుకు మేలు మార్గం వేసినట్లవుతుంది.

ఇవీ చూడండి...

తెదేపా క్రియాశీలక సభ్యత్వానికి మాజీ మంత్రి అరుణ రాజీనామా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details