విజయనగరం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పరిధిలోని ఎన్ఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అఖిల మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాలతో కలసి నిరసన తెలిపారు. విద్యార్థిని మరణానికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని నినదిస్తూ ఆందోళన చేపట్టారు. న్యాయం జరగకపోతే కళాశాల ఆవరణలో మృతదేహాన్ని పూడ్చిపెడతామని బంధువులు హెచ్చరించారు.
నెలిపర్తి గ్రామంలో ఉద్రిక్తత
అఖిల బంధువులు, విద్యార్థి సంఘాలు విద్యార్థిని మృతదేహంతో సాలూరు శివాజీ బొమ్మ నుంచి ర్యాలీగా కాలేజీ వరకు చేరుకున్నారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ గ్రామం పొలిమేర దాటి ఇతర గ్రామానికి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని ఎలా తీసుకొస్తారు అంటూ నెలిపర్తి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ర్యాలీని అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు నెలిపర్తి గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అఖిల మృతదేహంతో కళాశాల ఆవరణలో కుటుంబ సభ్యులు, బంధువులు శాంతియుతంగా నిరసన తెలియజేశారు.
అవమానమే ఆత్మహత్యకు పురిగొల్పింది
తెర్లాం మండలం బూర్జివలస గ్రామానికి చెందిన బోనంగి అఖిల ఎన్ఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థిని. ఈ నెల 25న కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈ నెల28న మరణించింది. అయితే అఖిల మృతికి కళాశాల వసతి గృహం వార్డెన్, ప్రిన్సిపాల్ కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.