ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీతో తొక్కించి ఘాతుకం... వీడిన బొబ్బిలి అనుమానాస్పద మృతి కేసు - బొబ్బొలి వార్తలు

గత నెల 6న గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పారిశ్రామికవాడ సమీపంలో గుర్తించిన బొబ్బిలి పోలీసులు...ఆ ఘటన వెనుక మిస్టరీని ఛేదించారు. ఇది హత్యేనని వెల్లడించారు. నమ్మిన స్నేహితుడే కర్కశంగా హతమార్చినట్లు తెలిపారు.

DSP Paparao revealing the details of the case
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ పాపారావు

By

Published : Oct 4, 2020, 8:12 AM IST

విజయనగరం జిల్లా బొబ్బిలి స్థానిక పారిశ్రామికవాడ సమీపంలో గత నెల 6న గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఈ ఘటన వెనుక మిస్టరీని ఛేదించారు. ఇది హత్యేనని వెల్లడించారు. నమ్మిన స్నేహితుడే కర్కశంగా హతమార్చినట్లు వివరించారు. భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో స్నేహితుడిపై కక్ష పెంచుకుని దారుణంగా చంపినట్లు వెల్లడించారు. రహదారి ప్రమాదంగా నమ్మించబోయిన లారీ డ్రైవర్‌ను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. శనివారం డీఎసీ్పీ పాపారావు, సీఐ శోభన్‌బాబులు ఎస్‌ఐలు ప్రసాదరావు, సత్యనారాయణతో కలిసి వివరాలను వెల్లడించారు.

కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ముల్పూరి రాంగోపాల్‌ (28) అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ తోట నాగేంద్రబాబు స్నేహితులు. గత ఆగస్టు 28న రాంగోపాల్‌ హైదరాబాదు వెళ్తానని ఇంటి వద్ద చెప్పి బయటకు వచ్చాడు. గతనెల 5 నుంచి ఆయన ఫోన్‌ పని చేయకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు రాంగోపాల్‌ చరవాణిని ట్రాకింగులో పెట్టగా బొబ్బిలి ప్రాంతంలో ఉన్నట్లు సంకేతాలు రావడంతో ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అంతవరకు గుర్తుతెలియని మృతదేహంగా ఉన్న ఇక్కడి కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడినట్లు డీఎసీ్పీ వెల్లడించారు. స్నేహితుడ్ని పథకం ప్రకారం లారీ డ్రైవరే హతమార్చినట్లు గుర్తించారు. భార్యపై ఉన్న అనుమానంతో ఆయన ఇలా చేశాడని తెలిపారు.

మద్యం తాగించి...
ఇంటి నుంచి హైదరాబాదు వెళ్తానని చెప్పిన రాంగోపాల్‌ అదే రోజు స్నేహితుడు నాగేంద్రబాబుతో లారీలో గుజరాత్‌ వెళ్లారు. అక్కడ నుంచి గతనెల 5న మార్బుల్స్‌ లోడుతో బొబ్బిలి వచ్చారు. తిరుగుప్రయాణంలో సాయంత్రం పారిశ్రామికవాడ వద్ద నాగేంద్రబాబు లారీని ఆపి రాంగోపాల్‌తో మద్యం తాగించాడు. అతను స్పృహ కోల్పోయాక రోడ్డుపై పడేసి లారీని పోనివ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. క్లీనర్‌ శివను క్యాబిన్‌లో పడుకోమని ఆయన నిద్రలోకి జారుకున్నాక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాసేపటికే శివ తేరుకుని రాంగోపాల్‌ గురించి ప్రశ్నించగా... విశాఖలోని సోదరుడు ఇంటికి వేరే వాహనంలో వెళ్తానని చెప్పి దిగిపోయాడని నమ్మబలికాడు. కంచికచర్లకు చేరుకున్నాక మళ్లీ గుజరాత్‌కు సరకులు తీసుకుని వెళ్లాడు. ఇక్కడ శివను కాకుండా వెంకటేశ్వరరావు అనే క్లీనర్‌ను మార్చాడు. అక్కడి నుంచి మార్బుల్స్‌తో బ్రహ్మపుర వెళ్లాడు. ఇలా ఇంటికి వెళ్లకుండా లారీలోనే నాగేంద్రబాబు గడిపేవాడు.

లారీ జీపీఎఎస్‌ ఆధారంగా..
రాంగోపాల్‌ స్నేహితుడు నాగ్రేందబాబుతో ఎక్కువగా ఉంటాడని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. లారీకి జీపీఎస్‌ ఉండటంతో విచారణ తేలికైంది. నాగేంద్రబాబు తొలుత క్లీనర్‌ శివను కాకుండా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని మార్చడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో కేసును త్వరితగతిన ఛేదించారు. నాగేంద్రబాబును అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. రాంగోపాల్‌ విదేశాల్లో ఎం.ఎస్‌ పూర్తి చేశాడు. హత్య చేసి ఉంటారని ముందే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన మేనమామ రాజేశ్‌ విలేకర్లకు తెలిపారు. మా అనుమానం నిజమైందన్నారు.

ఇదీ చదవండి:ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య

ABOUT THE AUTHOR

...view details