Requested To Government: విజయనగరం దాసన్నపేట గొల్లవీధిలో ఓ పెంకుటిల్లు.. అందులోనే మనవడు, మనవరాలితో కలిసి కాలం వెళ్లదీస్తోంది ఓ వృద్ధురాలు. ఈ పిల్లల్ని ఐదేళ్ల క్రితం.. కోడలు వదిలి వెళ్లిపోయింది. 5 నెలల క్రితం కుమారుడు రమణ కూడా మృతి చెందాడు. ఇప్పుడీ చిన్నారులకు..అమ్మైనా, నాన్నైనా.. లక్ష్మమ్మే.
మాకు డబ్బులు ఇచ్చేవారు ఎవరూ లేరు. వచ్చే పింఛన్‌తోనే పిల్లల పుస్తకాలు, నా మందులు కొంటున్నాం. మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. తల్లి వదిలేసిపోయింది. తండ్రి చనిపోయాడు. నేను చనిపోతే పిల్లలను పోషించేవారు లేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. -లక్ష్మమ్మ, పిల్లల నాయనమ్మ
లక్ష్మమ్మకు పింఛనే ఆధారం. సొంతిల్లు కూడా లేదు. శిథిలావస్థకు చేరిన ఈ పెంకుటిల్లుకు.. 500 రూపాయల అద్దె కడుతోంది. మిగతా డబ్బులో కొంత మొత్తాన్ని ఔషధాలకు వెచ్చిస్తుంది. మిగిలిన డబ్బుతోనే పప్పైనా, ఉప్పైనా. పిల్లలకు తిండి, తిప్పలకూ.. పింఛన్ సొమ్మే ఆధారం. పిల్లలిద్దరూ బడిలోనే మధ్యాహ్న భోజనం చేస్తారని,. సెలవురోజు తిండి పెట్టే స్థోమత కూడా లేదంటోంది లక్ష్మమ్మ. చిన్నారుల చిన్నచిన్న అవసరాలూ తీర్చలేకపోతున్నానని వాపోతోంది.