విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడ నిరుద్యోగులకు ఊరడింపుగా మారింది. పరిశ్రమలొస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగులుతోంది. కారణం.. ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడమే. ఉన్న పరిశ్రమలు మూతపడుతుండడం, కొత్తవి రాకపోవడంతో ప్రగతి లేదు. యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు తీసుకుని ప్రారంభించని వారి నుంచి స్వాధీనం చేసుకుంటామంటూ గత రెండ్రోజులుగా ఏపీఐఐసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
39 మందికి నోటీసులు..
పారిశ్రామికవాడలో 80 శాతం భూములు పరిశ్రమలకు ప్లాట్లుగా విభజించి కేటాయించారు. ఇందులో స్టీల్ ఎక్ఛ్సేంజ్ ఇండియాకు సుమారు 87 ఎకరాలు కేటాయించారు. మాంగనీసు ఓర్ ఇండియాకు 120 ఎకరాలు, బీకే స్టీల్‌కు 220 ఎకరాలు ఇచ్చారు. ప్రధానంగా ఈ మూడు పరిశ్రమలు వస్తే అనుబంధంగా మరికొన్ని వస్తాయని అంచనా వేశారు. ఇవి ఇంతవరకు ఏర్పాటు కాలేదు. పరిశ్రమ ఏర్పాటు చేయలేమని బీకే స్టీల్ యాజమాన్యం ఇప్పటికే చేతులెత్తేయడంతో ఆ స్థలాన్ని ఏపీఐఐసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండు పరిశ్రమల యాజమాన్యాలకు అధికారులు నోటీసులిచ్చారు. రసాయన, ఇటుకలు, కాగితపు తయారీ తదితర చిన్నతరహా పరిశ్రమలకు కూడా భూములు కేటాయించగా వారూ ముందుకు రాలేదు. మొత్తం 39 మందికి తాజాగా నోటీసులు అందజేశారు. ఏర్పాటైన యూనిట్లలో కొన్ని మూతపడ్డాయి. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది.
కారణం ఏమిటి?
ప్రభుత్వ రాయితీలపై స్పష్టత లేకపోవడం, విద్యుత్తుపై రాయితీ ఎత్తివేయడం, బ్యాంకర్ల సహకారం లేకపోవడం, ఏపీఐఐసీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, నూతన పారిశ్రామిక, విధానంపై అవగాహన కల్పించకపోవడం.