ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు. కలెక్టర్ డాక్టర్. హరి జవహర్‌లాల్ కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పొదుపు ఆవశ్యకతను తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్ నుంచి బాలాజీ కూడలి వరకు ఇందన పొదుపుపై విద్యుత్తు ఉద్యోగులు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌ను పొదుపు చేయటం ప్రతిఒక్కరి బాధ్యతని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విష్ణు తెలిపారు.
ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం పెరుగుతోందన్న ఆయన.. లోటును ఇప్పటికిప్పుడు పూడ్చాలంటే, కేవలం విద్యుత్‌ను పొదుపు చేయటం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇంధనం ఆదా, పొదుపు చర్యలను పాటించటం ద్వారా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేయవచ్చన్నారు. బీఈఈ స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలను వినియోగించటం ద్వారా తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందన్నారు. ఈ అంశాలపై అవగాహన కల్పించటంతో పాటు.., ఇంధన ఆదా ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కల్గించేందుకు నేటి నుంచి ఈ నెల 20వ వరకు పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.