తొలిసారి కార్పొరేషన్ హోదాలో ఎన్నికలు జరుగుతున్న విజయనగరం నగరపాలక సంస్థలో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ప్రచార కార్యక్రమంలో ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతల కుమార్తెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వైకాపా నుంచి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కుమార్తె శ్రావణి, తెదేపా నుంచి పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిలు తమ కార్పొరేట్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.
రక్తి కట్టిస్తున్న విజయనగరం పురపోరు ఎన్నికల ప్రచారం - విజయనగరం పురపోరు ఎన్నికల ప్రచారంలో మహిళా నేతలు
విజయనగరంలో పురపోరు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్షాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెదేపా, వైకాపా ముఖ్య నేతల కుమార్తెలు ఎన్నిక ప్రచార బాధ్యతలను చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ఇరు పార్టీలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
ఇటు కోలగట్ల, అటు అశోక్ గజపతి రాజు ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల్లో తమ కుమార్తెలకు మరింత ఆదరణ పెరుగుతుందనే వ్యూహంతో పురపోరు ప్రచార బాధ్యతలను కుమార్తెలకు అప్పగించారు. దీంతో ఇద్దరు అతివలు పార్టీ అభ్యర్థుల విజయం కోసం తమ ప్రచారపర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. తాము నేతల కుమార్తెలమే అయినా ఓటర్ల ముంగిట సామాన్యులుగా ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. వీరి వెంట ప్రజలు భారీగా తరలి వస్తుండడంతో విజయం తమదే అన్నట్టుగా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.