ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీనియర్, జూనియర్... మంత్రులుగా ప్రమాణస్వీకారం - oath

విజయనగరం జిల్లా నుంచి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, రాజకీయాల్లో కేవలం అయిదేళ్ల అనుభవం ఉన్న పుష్పశ్రీవాణిలతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు.

బొత్స, పుష్ఫశ్రీవాణి

By

Published : Jun 8, 2019, 3:28 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా నుంచి వైకాపా తరపున 9 మంది శాననసభకు ఎన్నికవగా... రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతోపాటు, పాముల పుష్పశ్రీవాణి మంత్రి పదవులు దక్కించుకున్నారు. సామాజిక వర్గాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం మంత్రి పదవులు ఇస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో వీరికి మంత్రి పదవి వరించింది.
ఆ నియోజకవర్గం నుంచి తొలిసారిగా...

పుష్ప శ్రీవాణి ప్రమాణం
జిల్లా ఆవిర్భావం నుంచి మంత్రి పదవి లభించని ఒకే ఒక్క నియోజకవర్గం కురుపాం. తాజాగా అక్కడ నుంచి విజయం సాధించిన పాముల పుష్పశ్రీవాణికి మంత్రి పదవి ఇవ్వడంలో ఆ లోటు తీరిపోయింది. పుష్పశ్రీవాణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. ఆమె 10వ తరగతి వరకూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు. జంగారెడ్డిగూడెంలోనే ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. విశాఖలో బీఈడీ పూర్తిచేసి తాను చదివిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. . 2014 మార్చి 14న శత్రుచర్ల పరీక్షిత్‌రాజుని పెళ్లి చేసుకున్నారు. కేవలం రెండు నెలల్లోగానే మే 6న జరిగిన ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం ప్రతిపక్ష పార్టీలో ఉన్నా మారుమూల గిరిజన ప్రాంతాలన్నీ విస్తృతంగా తిరుగుతూ అక్కడి సమస్యలపై పరిశోధించి సచిత్రంగా అసెంబ్లీ, జడ్పీ వేదికలుగా గొంతెత్తారు. మరోవైపు వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి విధేయురాలిగాను పేరు తెచ్చుకున్నారు. . రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన తెదేపా నేత శత్రుచర్ల విజయరామరాజు ఎత్తుల్ని చిత్తు చేసి మరీ తాజా ఎన్నికల్లో గెలుపొందడంతో ఆమెకు పార్టీలో అగ్ర తాంబూలం దక్కింది. ఆనవాయితీ పునరావృతం...
బొత్స ప్రమాణ స్వీకారం
2004 నుంచి చీపురుపల్లిలో గెలుపొందిన నేతకు మంత్రి పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి బొత్సకు మంత్రిత్వ పదవితో అదే పునరావృతమైంది.2004, 2009లల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో గెలుపొందడమే కాకుండా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, రవాణాశాఖ, గృహనిర్మాణశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రిగాను ఆయన పనిచేశారు.2012 నుంచి 2015 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా జోడు పదవుల్లో కొనసాగిన ఏకైక నేతగా సైతం బొత్స గుర్తింపు పొందారు. 2017లో కాంగ్రెస్‌ నుంచి వైకాపాలో చేరారు. అయిదేళ్ల పాటు అధికారానికి దూరమైనా తన వర్గం నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజల్లోను పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని నిలుపుకోగలిగారు.

ABOUT THE AUTHOR

...view details