విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వేడుకగా జరిగింది. అనంతరం మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు.
రాష్ట్రంలో ఏడు చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్త జెట్టిలను నిర్మించనున్నట్లు చెప్పారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు వంద కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. 2024 నాటికి ప్రతి గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత నీటి సరఫరాకు బృహత్తర ప్రణాళిక సిద్దమవుతుందని మంత్రి తెలిపారు.