Jaya Prakash Narayana: 'ఓటర్ల జాబితా బాగుపడిందనుకున్నా.. కానీ రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నట్టు లేదు' Lok Satta Party Jaya Prakash Narayana: ఓటర్ల జాబితా విషయంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని.. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లు తొలగించారని.. ఒక్కో ఇంటి పేరుతో 500 ఓట్లు ఉన్నాయని పత్రికా ముఖంగా వింటున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైన ఉందని జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. దీని కోసం లోక్ సత్తా ఉద్యమం - ప్రజాస్వామ్య పీఠం ద్వారా.. ఒక ఉద్యమం చేపట్టబోతున్నామన్నారు. ఇందులో భాగంగా "ఓట్ ఇండియా - సేవ్ డెమక్రసీ" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు.
విజయనగరంలో "ఓట్ ఇండియా - సేవ్ డెమక్రసీ" పోస్టర్ను జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. అనంతరం.. జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సత్తా ఉద్యమం - ప్రజాస్వామ్య పీఠం చాలా ఏళ్లుగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం పోరాడుతోంది. ఈ ప్రయత్నం ద్వారా ఉపయోగపడిందని తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక్కో ఇంటి పేరు మీద వందల కొద్దీ ఓట్లు ఉన్నాయని.. చాలా పేర్లు అక్రమంగా తొలగించారని.. పత్రికా ముఖంగా వింటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను వెలికి తీసేందుకు లోక్ సత్తా శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా విస్తృత సర్వేలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఓటర్లను సైతం జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
"ఆంధ్రప్రదేశ్లో ఒక్కో ఇంట్లో 500 ఓట్లు ఉన్నాయని ఒకచోట, చాలా పేర్లు తొలగించారని మరోచోట.. అది కేవలం అధికారుల అలసత్వం వలన మాత్రమే కాదని పక్షపాత రాజకీయాలు ఉన్నాయని రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత ఉందో నాకు తెలియదు. కాబట్టి ఈ ఓట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటికే దీనిని దేశవ్యాప్తంగా చేశాము. ఓటర్ల జాబితా కాస్త బాగుపడిందని నమ్మాం. కానీ ప్రస్తుతం చూస్తుంటే.. వాతావరణం అంత బాగున్నట్టు లేదు.
అందువలన రెండు పనులకు.. లోక్ సత్తా ఉద్యమం - ప్రజాస్వామ్య పీఠం సిద్ధంగా ఉండాలి. మొదటిది.. కొన్ని చోట్ల విస్తృతమైన సర్వేలు చేయడం, రెండోది.. అర్హత ఉండి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ఫామ్ - 6ని అందజేయనున్నాం. దీని కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. దీని ద్వారా కేవలం విమర్శలు మాత్రమే కాకుండా.. నిజం ఎంత ఉందో తెలుస్తుంది". - జయప్రకాష్ నారాయణ, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు